జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించడంతో పాటు నిర్మించిన సినిమా ”కింగ్‌స్టన్’. తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలపై రూపొందింది. ఇండియాలో ఫస్ట్ సి అడ్వెంచర్ థ్రిల్లర్ ఇది. ఇందులో దివ్యభారతి హీరోయిన్. ‘బ్యాచిలర్’ తర్వాత జీవీ ప్రకాష్ కుమార్ సరసన ఆవిడ మరోసారి నటించారు. శుక్రవారం సినిమా విడుదల అవుతున్న సందర్భంగా టాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…
హాయ్… దివ్యభారతి గారు! ఎలా ఉన్నారు?
నేను చాలా బావున్నాను అండీ. ”కింగ్‌స్టన్’ ‘ పబ్లిసిటీ కోసం హైదరాబాద్ రావడం సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ ‘మహారాజా’లో మీరు కనిపించింది కాసేపే అయినా మంచి ఇంపాక్ట్ చూపించారు! థాంక్యూ. ఆ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. తమిళంలో నా పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో… తెలుగులోనూ అంతే మంచి పేరు వచ్చింది. ఇక్కడ నుంచి ఎన్నో ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది.
‘బ్యాచిలర్’తో జీవీ ప్రకాష్ కుమార్‌తో మీ పెయిర్‌కి మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఈ సినిమాతో కాంబినేషన్ రిపీట్ అవుతోంది.
అవును. ‘బ్యాచిలర్’ మంచి హిట్. అది తెలుగులో విడుదల చేస్తారని అనుకోలేదు. తెలుగులో రిలీజ్ చేశాక మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఇది ఇండియాస్ ఫస్ట్ సీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా. అందులోనూ జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా ”కింగ్‌స్టన్’ ‘లో నేను నటించడం సంతోషంగా ఉంది. ఫస్ట్ నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఆయన ఒక్కరే నిర్మాత. తర్వాత జీ స్టూడియోస్ వచ్చింది. సినిమా కోసం జీవీ ప్రకాష్ కుమార్ చాలా కష్టపడ్డారు.
”కింగ్‌స్టన్’ ‘లో యాక్షన్ సీన్లు చేసేటప్పుడు గాయాలు అయ్యాయని జీవీ ప్రకాష్ తెలిపారు. మరి మీకు?
నాకు ఎటువంటి గాయాలు కాలేదు. మా యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ యాక్షన్ సీన్స్ కోసం కొంత ప్రిపేర్ అయ్యాను.
సాధారణంగా హీరోయిన్లకు యాక్షన్ సీన్లు చేసే అవకాశం రాదు కదా!
అవును. చాలా అరుదుగా ఇటువంటి క్యారెక్టర్లు లభిస్తాయి. ఫస్ట్ యాక్షన్ చేయడం కొంత థ్రిల్లింగ్ ఫీలింగ్. ఇందులో నేను రోప్ సీన్స్ చేశా. యాక్షన్ సీన్స్ చేయడం ఎంత కష్టం అనేది తెలిసింది. ఇటువంటి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ మరొకటి నాకు వస్తుందో లేదో తెలియదు. ఆల్రెడీ సినిమా చూశా. హ్యాపీగా ఉన్నాను. ఆడియన్స్ ఎప్పుడు సినిమా చూస్తారా? అని ఎగ్జైటెడ్ గా ఉన్నాను.
”కింగ్‌స్టన్’ ‘లో మీ క్యారెక్టర్ గురించి చెబుతారా?
‘బ్యాచిలర్’లో నేను సిటీ గాళ్ రోల్ చేస్తే… ”కింగ్‌స్టన్’ ‘లో ఒక పల్లెటూరి అమ్మాయి రోల్ చేశారు. చేపలు పట్టడం ఆ ఊరి ప్రజల జీవనాధారం. సముద్ర తీరంలోని ఆ ఊరంతా మత్యకారులు ఉంటారు. వాళ్ళు సముద్రంలో చేపలు పట్టడానికి ఎందుకు వెళ్లడం మానేశారు? వాళ్ళకు ఉన్న శాపం ఏమిటి? దాన్ని హీరో హీరోయిన్లు ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నాది హీరో గాళ్ ఫ్రెండ్ రోల్. ఊరిని కాపాడటం కోసం హీరో ప్రయత్నిస్తే హీరోయిన్ ఎలా సాయం చేసింది? అతనితో సముద్రంలో ఎందుకు వెళ్ళింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
”కింగ్‌స్టన్’ ‘ను ఫ్రాంచైజీగా సినిమా తీస్తామని, మరో మూడు కథలు ఉన్నాయని చెప్పారు జీవీ ప్రకాష్. అందులో మీ రోల్ ఉంటుందా?
ఉంటుంది. తర్వాత పార్టుల్లో కూడా నా రోల్ కూడా కంటిన్యూ అవుతుంది.
తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు?
తెలుగులో నేను ఒక సినిమా చేశా. సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన ‘గోట్’ విడుదలకు రెడీ అవుతోంది. పైగా, నా అసిస్టెంట్ తెలుగు వ్యక్తి. అతని దగ్గర నేను తెలుగులో మాట్లాడతా. అలా నేర్చుకుంటున్నాను.
తెలుగులో మీకు ఇష్టమైన హీరోలు ఎవరు?
నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ‘ఖుషి’ నాకు బాగా నచ్చింది. అలాగే, ‘పుష్ప’రాజ్ అల్లు అర్జున్ గారు కూడా!
మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్?
తమిళంలో రెండు సినిమాలు చేశా. తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి.