తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో రెండు ఎమ్మెల్సీ పదవలు వచ్చి చేరుతున్నాయి. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ ఆలిఖాన్ లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి అడ్డంకి తొలగింది.
తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా కోదండరామ్, అమీర్ ఆలిఖాన్ లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బిఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్బంగా కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాల ప్రక్రియను అడ్డుకుంటే గవర్నర్ తో పాటు ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని తేల్చిచెప్పింది. ఈ పిటీషన్ పై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది ధర్మాసనం.
దీంతో గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ ఆలిఖాన్ ల నియామకానికి అడ్డు తొలగిపోయింది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయబోతున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్టి.. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ ఆలిఖాన్ ల చేత తన ఛాంబర్ లో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు.