సుదీర్ఘ విరామం తర్వాత మాజీ సీఎం కేసీఆర్.. గులాబీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని, తాను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. రాబోయే ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చెందిన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
కొడితే మాములుగా ఉండదు
‘‘నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్న. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం నాకు ఉన్న అలవాటు. రాబోయే ఫిబ్రవరి నెల చివరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. ఎక్కడి ప్రాజెక్ట్ లు అక్కడే పడుకున్నాయి. సంగమేశ్వరం , బసవేశ్వరాం, కాళేశ్వరం అన్ని ఎండబెడుతున్నారు. సంగమేశ్వర , బసవేశ్వర ప్రాజెక్ట్ టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది. నేను హరీష్ రావుకు చెప్తున్న సంగమేశ్వర , భసవేశ్వర ప్రాజెక్ట్ ల పై పెద్ద యెత్తున దండయాత్ర చేయాలి. వాటికి నీళ్లు రావాలి. ఆలోచన లేకుండా ఎవడో ఏమో చెబితే నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం. కైలాస ఆటలో పైకి పోయినక పెద్ద పాము మింగినట్టు అయ్యింది. కరోనాలో కూడా రైతు బంధు ఇచ్చి రైతులకోసం మంచి పథకాలు తెస్తే అంత గంగలో కలిసిపోయింది. గురుకుల హాస్టళ్లలో తిండి బాగా లేక పిల్లలకు అస్వస్థతకు గురి అవ్వడం బాధ కలిగిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం పుట్టింది కాదు’’ అని రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.