-
దర్యాప్తులో దాపరికం
-
కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు
-
14 ప్రశ్నలను సంధించిన విద్యార్థులు
కోల్‌కతా ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో లైంగిక దాడికి, హత్యకు గురైన మెడికో కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దర్యాప్తు మొత్తం సంజయ్ రాయ్ అనే అనుమానితుడి చుట్టూ తిరగడంపై అనుమానాలు కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కార్ జూనియర్ డాక్టర్‌పై లైంగికదాడి, హత్య కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఉదంతం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి, నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకూ దర్యాప్తు మొత్తం సంజయ్ రాయ్ అనే వ్యక్తి మీదే కేంద్రీకృతమై ఉన్నది. అతడిని పోలీసులు అరెస్టు చేసి, ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కోల్‌కతా పోలీసులు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నలుగురు ఇతర జూనియర్ డాక్లర్లను కూడా సోమవారం ప్రశ్నించింది. వీరిలో ముగ్గురు డాక్టర్లు, ఒక ఇంటర్న్ కూడా ఉన్నారు. ఘటన జరిగిన గురువారం రాత్రి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి, మృతురాలితో కలిసి వారు ఘటనా ప్రాంతంలో (incident spot) భోజనం చేశారు. అసలు ఎవరికీ తెలియకుండా ఇటువంటి దారుణాలు ఒక ప్రభుత్వ హాస్పిటల్‌లో ఎలా జరుగుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దర్యాప్తు అధికారులు నిర్బంధాన్ని, ఎంపిక చేసిన సమాచారాన్ని లీక్ చేయడాన్ని చూస్తే ఈ ఘటనను మసకబార్చే లేదా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటి వరకూ సమాధానం దొరకని 14 ప్రశ్నలను కళాశాలలోని విద్యార్థులు, పరిశీలకులు లేవనెత్తుతున్నారు.
1. మృతురాలి మెడ, ఎడమకాలు, మడమ, కుది చేతి ఉగరం వేలుపై గాయాలు ఉన్నట్టు ప్రాథమిక పంచనామాలో పేర్కొన్నారు. అయితే.. శరీరంపై గాయాలయ్యాయా? గాయాలు లోతుగా ఉన్నాయా? ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా? తదితర గాయాల స్వభావాన్ని మాత్రం వెల్లడించలేదు. మృతురాలి కాలర్‌బోన్, కటిభాగం ఎముకలు విరిగాయనడాన్ని పోలీసులు తిరస్కరిస్తున్నారు. అసలు మృతురాలి ఒంటిపై గాయాల అసలు స్వభావం ఏమిటి? ఆ గాయాలు ఎందుకు అయ్యాయి?
2. వార్డులోని నర్సింగ్ స్టేషన్ ఘటన జరిగిన సెమినార్ హాల్‌కు చాలా దగ్గరలో ఉన్నది. తమకు సమీపంలోని సెమినార్‌హాల్‌లో ఒక యువతిపై దారుణ లైంగిక దాడి జరుగుతుంటే ఆమె వేసిన కేకలు ఎవరికీ వినిపించలేదా?
3. మృతురాలిపై అఘాయిత్యం జరిగే సమయానికే ఆమెకు మత్తు మందు ఇచ్చారా? దీనిపై పోస్టుమార్టం నివేదిక ఏం చెబుతున్నది?
4. నేరం జరిగిన సమయంలో ఆమె కేకలు వేయలేదా?
5. చనిపోయిన తర్వాత ఆమెపై లైంగికదాడి జరిగిందా? లైంగికదాడి చేసి చంపేశారా? ఈ విషయంలో పోలీసుల నుంచి ఎందుకు వివరణ లేదు.
6. అనుమానితుడు రాయ్‌తోపాటు మరెవరైనా వ్యక్తి లేదా వ్యక్తులు ఈ నేరంలో భాగమయ్యారా? ఒకే వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టడం సాధ్యమేనా?
7. రెండో లేదా మూడో వ్యక్తి ఈ నేరంలో భాగం కాలేదని కోల్‌కతా పోలీసుల సిట్ నిర్ధారణకు వచ్చిందా?
8. ఒక ఇంటర్న్ ఈ నేరంలో భాగమైనట్టు విద్యార్థుల ఫోన్లలో ఒక ఆడియో క్లిప్ తిరుగుతున్నది. ఆ క్లిప్‌ను తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ ఆదివారం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఆడియో క్లిప్‌ను నిర్థారించుకునేందుకు సదరు ఇంటర్న్ ఎవరో గుర్తించి, ఇంటరాగేట్ చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారా?
9. రాయ్ అనే వ్యక్తి తాగి వచ్చి, వైద్యులతో అసభ్యంగా ప్రవర్తించేవాడన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో గతంలో ఏమైనా ఫిర్యాదులు అతడిపై నమోదయ్యాయా? నమోదైతే కళాశాల అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు?
10. కళాశాల ప్రాంగణంలో రాయ్ మద్యం తాగి వచ్చి తిరుగుతున్న విషయం కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు లేదా మేనేజ్‌మెంట్‌కు తెలుసా?
11. రాయ్ తన మూడు నెలల గర్భిణి అయిన భార్యపై దాడి చేసిన విషయంలో కాళీఘాట్ పోలీస్ స్టేషన్ లో రెండేళ్ల క్రితం గృహ హింస కేసు నమోదైంది. దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ ఎందుకు లేవు?
12. రాయ్ పూర్వాపరాలు తెలుసుకునేందుకు పోలీసులు, ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అధికారులు ఏమైనా ప్రయత్నాలు చేశారా?
13. గార్డ్ డ్యూటీలో ఉండే పౌర వాలంటీర్లకు హాస్పిటల్ బిల్డింగ్‌లోని ఏదైనా ప్రాంతానికి యాక్సెస్ ఎందుకు కల్పించారు?
14. నేరం జరిగిన తర్వాత ఆర్‌జీ కార్ కాలేజీకి రాజీనామా చేసిన ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను గంటల వ్యవధిలోనే కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా మమతాబెనర్జీ ప్రభుత్వం ఎందుకు నియమించింది?