- తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా
- మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం: అక్టోబరు 07, 2024: ప్రజలకు ఉచిత ఇసుక అందించాలనే లక్ష్యంతో జూలై 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చిందని, అక్టోబర్ 16 నుంచి పూర్తిస్థాయిలో వినియోగదారులకు ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం మంత్రి నగరంలోని రహదారులు భవనాల అతిథుల గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలం ప్రభావంతో జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుక బయటకు తెచ్చేందుకు అవకాశం లేదని, అయితే అక్టోబర్ 16 నుంచి పూర్తిస్థాయిలో వినియోగదారులకు ఉచిత ఇసుకను అందుబాటులోకి తెస్తామని, ఆ లోపుగా ర్యాంపుల నిర్మాణం ఇతర రవాణా సౌకర్యాలను సమకూర్చటం జరుగుతుందన్నారు. జిల్లాలో డీసిల్టేషన్ పాయింట్లు 28, మాన్యువల్ 8, సెమీ మేకనైజ్డ్ రీచ్ లు 48 ఉన్నాయన్నాని, అదేవిధంగా పట్టా భూములను గుర్తించి వాటి నుంచి సైతం డిమాండ్కు తగ్గ ఇసుకను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఉచిత ఇసుక విధానమును పర్యవేక్షించేందుకు, అదేవిధంగా ధరలను నిర్ణయించేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు.
వినియోగదారులు ఉచిత ఇసుక పొందుటకు కేవలం రవాణా, నిర్వహణ ఖర్చులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. సొంత వాహనం కలిగిన వారు లోడింగ్ చార్జీలు మాత్రమే చెల్లించి ఇసుకను పొందవచ్చు అన్నారు. అవసరం మేరకే ఇసుకను తీసుకెళ్లాలని, అలాకాకుండా నిల్వ చేసుకుని లబ్ది పొందేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వినియోగదారులు ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకుని పొందవచ్చని, ఏ స్టాక్ యార్డులలో ఎంత మొత్తంలో ఇసుక అందుబాటులో ఉన్నదనే వివరాలు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా నిత్యం తెలియపరచడం జరుగుతుందన్నారు. సమాచారం నిమిత్తం టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు ఉచిత ఇసుకను అందించేందుకు ఒకవైపు కృషి చేస్తుంటే మరోవైపు కొంతమంది పనుగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, దళారులు చేరి ధరలు పెంచినట్లుగా చూపించి దోపిడీకి పాల్పడేందుకు సిద్ధమవుతున్నారన్నారు. దీనిని అరికట్టేందుకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నాని, దీని ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాణ్యమైన మద్యం సరఫరా..
వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చిందని, దీనిలో భాగంగా ఇటీవల 3,336 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. షాపు పొందేందుకు దరఖాస్తు ఫీజ్ రెండు లక్షలు చెల్లించి డ్రాలో పాల్గొనవచ్చని, ఇప్పటివరకు దాదాపు 20 వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. తర్వాతి దశలో గీత కార్మికులకు 10 శాతం 340 షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా డ్రా నిర్వహిస్తామన్నారు.
భారతదేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఒక మనిషి ఎన్ని దరఖాస్తులైన చేసుకొని డ్రాలో పాల్గొనవచ్చని, ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో కూడా ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. మద్యం షాపులు పొందేందుకు సిండికేట్లు చేసినట్లు ప్రభుత్వ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు..
మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఇందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ద్వారా డంపింగ్ యార్డ్ ప్రక్షాళనకు రూ.12 కోట్లు కేటాయించారని, దీనితో మచిలీపట్నానికి చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని మంత్రి తెలిపారు.
అదేవిధంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మచిలీపట్నం కార్పొరేషన్ అభివృద్ధి నిమిత్తం 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.16 కోట్లు కేటాయించారని, ఇది కూటమి ప్రభుత్వ విజయమన్నారు.
విజన్ 2047 లో భాగంగా కృష్ణా జిల్లాకు రాబోయే రోజులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అందులో భాగంగా మచిలీపట్నంలో సక్రమ పారిశుద్ధ్యం నిర్వహణ, డ్రైనేజీ ప్రక్షాళన, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటూ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
మచిలీపట్నం నియోజకవర్గంలోని రహదారుల నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.2 కోట్లు కేటాయించారని కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.30 కోట్లతో ప్రతి గ్రామంలో రాబోయే మూడేళ్లలో డ్రైనేజీ వ్యవస్థ, పేదవారికి ఇళ్ళు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో కూటమి నాయకులు బండి రామకృష్ణ, తలారి సోమశేఖర్, కుంచె నాని, ఇలియాజ్ పాషా, ఖాజావలి, కొట్టే వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.