కెసిఆర్ సభకు వస్తే మజా ఉంటుంది
కెసిఆర్ ఓడిపోయినా తెలంగాణ జాతిపితగా ఊహల్లో బ్రతుకుతున్నారు
హరీష్‌రావు గ్రౌండ్‌లో తిరిగితే కెటిఆర్ గాలిలో తిరుగుతారు…
పార్టీ బాధ్యతలు ఎవరికి చెప్పినా కష్టమే….
అందుకే కెసిఆర్ దగ్గర ఈ బాధ్యతలు పెట్టుకున్నారు
కెసిఆర్ సభకు రాకపోవడంతో
ఆ పార్టీ నేతల పరిస్థితి తల్లి లేని పిల్లలుగా అనిపిస్తుంది
విలేకరులతో చిట్‌చాట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో లేకపోవడం వల్ల కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో ఆయన అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ చేశారు. కెసిఆర్ సభకు వస్తే మజా ఉంటుందని, విద్యుత్‌పై జరిగిన చర్చలో కెసిఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేదన్నారు. ఆయన ఓడిపోయినా ఇంకా తెలంగాణ జాతిపిత అనుకుంటున్నారని, కెసిఆర్ ఊహల్లో బ్రతుకుతున్నారని ఆయన తెలిపారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్ ఇద్దరిలో ఎవరికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చినా బిఆర్‌ఎస్ ఆగం అవుతుందన్నారు.
హరీష్‌రావు మంచి అనుభవం ఉన్న నేత, కానీ, ఆయనకు ఇవ్వరని, కెటిఆర్‌కు అవగాహన లేదని ఆయనకు ఇస్తే పార్టీలో ఎవరూ ఉండరని, కెటిఆర్ గాలిలో తిరిగితే హరీష్‌రావు గ్రౌండ్‌లో తిరుగుతారని రాజగోపాల్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. హౌస్‌లో సస్పెన్షన్లు చేయకపోవడం తమ ప్లాన్ అని, కెసిఆర్ సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతల పరిస్థితి తల్లి లేని పిల్లలుగా అనిపిస్తుందని ఆయన అన్నారు. పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళ్తారని ఆయన సబితారెడ్డిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.
తాను మహిళా శాసనసభ్యురాలని అందరికి చెప్పుకుంటున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా, పార్టీ మారి ఉండాల్సింది కాదని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. ఎంత దోపిడీ చేయాలో అంత దోపిడీ చేసిందని ఆయన ఆరోపించారు. తప్పులు ఎక్కడ బయటపడతాయోనని అసెంబ్లీలో బిఆర్‌ఎస్ గందరగోళం సృష్టిస్తుందని ఆయన అన్నారు.