కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఆఫర్ చేసిందని, కానీ సీనియర్ నేత జానారెడ్డి అందుకు అడ్డు తగులుతున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ తనకు హామీ ఇచ్చిందని, ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రిని చేస్తామని మళ్ళీ హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తనకు మంత్రి పదవి రాకుండా సీనియర్ నేత జానారెడ్డి అడ్డుపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్లో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహిస్తే లేనిది, ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇద్దరు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్, నల్గొండ జిల్లా చండూరులలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తనకు మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తానన్నారు. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుంది. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, కెపాసిటిని బట్టి వస్తుంది. అయితే 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి నేడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చింది.
ఎంపీగా గెలిపిస్తే మంత్రి పదవి అని మళ్లీ ఆఫర్ చేశారు
హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో మంత్రులకు ఇంఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన ఎంపీలు గెలవలేదు, కానీ భుననగిరిలో ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎంపీని గెలిపించా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గద్దె దింపాలని లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేసి చూపించా. అది నా కమిట్మెంట్. నా మంత్రి పదవి విషయంలో జానారెడ్డి లాంటి వ్యక్తులు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే కాలర్ ఎగరేసుకొని ఉంటాడే తప్పా, అడుక్కునే పొజిషన్లో ఎప్పుడూ ఉండడు. పార్టీలో పైరవీలు చేసే వారిని పక్కనపెట్టాలి. ప్రజల కోసం, అభివృద్ధి కోసం పనిచేసే వారికి పదవులు ఇవ్వాలి. ప్రజలకు పనికొచ్చే మనిషికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంటే కొంచెం బాధగా ఉంది. నేను వాళ్ల వింటానో, లేదోనని కొందరు భయపడుతున్నారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ కుటుంబ పార్టీ
రాజగోపాల్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. మంత్రి పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు అంతా మంచి చేయాలి. రాబోయే రోజుల్లో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిని పెంచి రైతులకు ఇంకా మంచి చేసేందుకు కృషి చేస్తా. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న సంకల్పంతోటి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నపుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ. రాచరికంతో కొనసాగిన పార్టీ, వారికి దండాలు పెట్టిన వారికే మంత్రి పదవులు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. కరెంటు గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ కొంతమంది రైతులకు ఇవ్వాల్సి ఉంది అది వాస్తవమే. డబుల్ బెడ్ రూమ్ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పేదలను మోసం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తుంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పాలయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీరు అందించే బాధ్యత రాజగోపాల్ రెడ్డిదే. ప్రభుత్వం పెట్టిన సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది.