ఏపీలో త్వరగా జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన చేసింది. శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్నటి వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగబాబు పేరు ప్రచారం కాగా, బుధవారం ఉదయం ఆయన రాజ్యసభ స్థానం కోసం చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఊపందుకున్న సమయంలో జనసేన పార్టీ వదంతులకు చెక్ పెట్టింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నాగబాబు ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి సమాచారం వచ్చింది. దాంతో నాగబాబు నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారని పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా..
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఫిబ్రవరి 27న జరిగాయి. అంతలోనే ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెలాఖరులో మొత్తం 10 స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, మార్చి 20న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనుంది ఈసీ. మార్చి 29న ఏపీలో 5 మంది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, తెలంగాణలో 5 మంది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.
ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా..
ఏపీలో ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, పి.అశోక్‌బాబు, జంగా కృష్ణమూర్తి , దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు పదవీకాలం మార్చి 29న ముగియనుంది. వీరిలో జంగా కృష్ణమూర్తి మినహా మిగతా ఎమ్మెల్సీలు టీడీపీ నుంచి ఎన్నికైన వారే. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి సైతం టీడీపీలో చేరడం తెలిసిందే. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుండగా.. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్న కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను దక్కించుకోనున్నాయి. జనసేన నుంచి నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. ఆయన త్వరలో ఏపీ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.