హైదరాబాద్‌లో టమాటా ఫైట్ ఫెస్టివల్
టమాటాలతో కొట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్రం వేదిక కానుంది. హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా టమాటా ఫైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు మొదలు అవుతుంది. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సుమారు 25 వేల జాతుల అరుదైన వృక్షాలు, మొక్కలు, శిల్పాలతో కూడి ఉన్న ‘ఎక్స్‌పీరియం’ ఎకో పార్క్ దీనికి వేదిక కానుంది. హైదరాబాద్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైన.. ఉల్లాసభరితమైన టమాటా ఫైట్ ఫెస్టివల్ జరగబోతోంది. ఈ టమాటా ఫైట్ ఫెస్టివల్ స్పెయిన్‌లోని ప్రసిద్ధ లా టమాటినా పండుగ నుండి ప్రేరణ పొందింది. వేల కిలోల టమాటాలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆనందించే ఈ ప్రత్యేకమైన వేడుక మే 11, 2025న ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్ నగర శివారులోని ‘ఎక్స్‌పీరియం’ ఎకో పార్క్‌లో జరగనుంది. ఈ ఎకో పార్క్ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. 85 దేశాల నుండి దిగుమతి చేసుకున్న సుమారు 25 వేల జాతుల అరుదైన వృక్షాలు, మొక్కలు మరియు అద్భుతమైన శిల్పాలతో ఇది ఆహ్లాదకరమైన ప్రదేశంగా విరాజిల్లుతోంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరు వద్ద ప్రముఖ వ్యాపారవేత్త రాందేవ్ రావు ఆరున్నరేళ్ల సుదీర్ఘ శ్రమతో 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ విశాలమైన ఎకో పార్క్‌ను తీర్చిదిద్దారు. దేశంలోనే అతి పెద్దదిగా పేరుగాంచిన ఈ ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.
ఇక్కడ పాల్గొనేవారు వేల కిలోల టమాటాలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ తమ ఆనందాన్ని వెలిబుచ్చుతారు. అంతేకాదు.. ఈ వేడుకలో లైవ్ డీజే సంగీతం యువతను ఉర్రూతలూగిస్తుంది.. నృత్య ప్రదర్శనలు అందరినీ అలరిస్తాయి. రుచికరమైన ఆహారాన్ని అందించే ఫుడ్ స్టాల్స్‌తో పాటు.. షాపింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా మార్కెట్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. పిల్లలు, పెద్దలు ఆనందించేందుకు ప్రత్యేకమైన ఫన్ జోన్స్ కూడా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని పొందడానికి టికెట్ల ధరలు రూ. 499 నుండి ప్రారంభమై రూ. 3,499 వరకు వివిధ కేటగిరీలలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ.. ఈ ఫెస్టివల్‌లో ఉపయోగించిన టమాటాలను వృథా చేయకుండా వాటిని ఎరువుగా మార్చి రైతులకు అందించనున్నారు. వేసవి తాపంతో అల్లాడుతున్న హైదరాబాదీలకు ఈ టమాటా ఫైట్ ఫెస్టివల్ ఒక సరికొత్త.. సరదా అనుభవాన్ని అందించడంలో సందేహం లేదు. స్నేహితులు,కుటుంబ సభ్యులతో కలిసి నవ్వులు, కేరింతల మధ్య గడిపేందుకు ఇది ఒక చక్కని అవకాశం.