Saturday, November 30, 2024

వచ్చేనెల 9వ తేదీన కొత్వాల్‌గూడ ఎకో పార్కు ప్రారంభం

ఏర్పాట్లు చేస్తున్న హెచ్‌ఎండిఏ అధికారులు

కొత్వాల్‌గూడ ఎకో పార్కు సందర్శకుల కోసం సిద్ధమవుతోంది. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 9వ తేదీన దీనిని ప్రారంభించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వీటితో పాటు హెచ్‌ఎండిఏ పరిధిలో నిర్మాణం చేస్తున్న కాలనీ పార్కులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని దాదాపుగా 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్‌గూడ ఎకో పార్కు నిర్మాణానికి హెచ్‌ఎండిఏ శ్రీకారం చుట్టింది. రెండేళ్ల క్రితం హెచ్‌ఎండిఏ ఈ పార్కు నిర్మాణాన్ని చేపట్టగా ప్రస్తుతం ఈ పార్కులో మొదటి దశ పనులు అనుకున్న లక్ష్యం మేరకు పూర్తయ్యాయి. మొత్తం రూ.300 కోట్ల భారీ అంచనా వ్యయంతో దీనిని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు.

అతిపెద్ద అక్వేరియం ఏర్పాటు
ఏడాది పొడవునా హిమాయత్‌సాగర్ నిండుగా ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది సందర్శకులు ఈ జలాశయం చూసేందుకు వస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలోనే హెచ్‌ఎండిఏ చేపట్టిన ఎకో పార్కు నిర్మాణం సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగానే అతిపెద్ద అక్వేరియంను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎకో పార్కులో తొలి విడత నిర్మాణంలో ఎలివేటెడ్ వాక్వే(నడక దారి), పక్షుల గ్యాలరీ, వివిధ రకాల పూలతో కూడిన ఉద్యానవనం, బటర్‌ప్లై పార్కు, పార్కులో అందంగా తీర్చిదిద్దిన పచ్చికబయళ్లను (గడ్డి) సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.

రెండో దశలో ఫేజ్- 2 కింద అక్వేరియం, ఇతర ప్రకృతి అందాలు, థీమ్ పార్కులు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. దీంతోపాటు ఈ ఎకోపార్కు పలు ప్రత్యేకతను కలిగి ఉంది. అందమైన ప్రకృతి రమణీమైన ల్యాండ్‌స్కేపింగ్, వివిధ రకాల ఆటలు, సాహసాలతో అడ్వేంచర్ జోన్, దేశంలోనే అతి పెద్దదైన ఏవియరీ, లగ్జరీ రిసార్ట్‌తో పాటు మినీ కన్వెన్షన్ సెంటర్, సముద్ర జీవులతో అక్వేరియం, 2.5 కిలోమీటర్ల దూరంతో కూడిన ఎలివేటెడ్ వాక్ ప్రాంతం, ఔటర్ రింగ్‌రోడ్డుకు అటు, ఇటు రాకపోకలు సాగించేందుకు సస్పెన్షన్ వంతెనలు ఇక్కడి ప్రత్యేకతలుగా అధికారులు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular