తనను వేధించారని మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళలను గౌరవించి, ఆరాధించే గొప్ప సంస్కృతి కలిగిన తెలంగాణ గడ్డపై మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవం తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్ల తండ్రిగా, ఏ మహిళకు ఇలాంటి దురదృష్టకర పరిస్థితి రాకూడదని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అన్నారు. యావత్ తెలంగాణ సమాజం తరుపున మిల్లా మాగీకి హృదయ పూర్వకంగా క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు.
ఆమెకు జరిగిన సంఘటన తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించదన్న ఆయన అది తెలంగాణ ప్రజల విలువలకు వ్యతిరేకమన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడాన్ని సంప్రదాయంగా భావించే తెలంగాణకు, రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మలే నిత్య స్ఫూర్తి ప్రదాతలు అన్నారు. మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై జరిగే వేధింపులను ఎదిరించి నిలబడాలంటే అసాధారణ ధైర్యం ఉండాలన్న కేటీఆర్ మిల్లా మాగీ చూపిన తెగువ అభినందనీయం అన్నారు.
ఈ భయంకర అనుభవం నుండి ఆమె త్వరలోనే కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మిల్లా మాగి చేసిన ఆరోపణలపై విచారణ జరపకుండా ఆమెనే దోషిగా నిలబెట్టాలనుకుంటున్న ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగి మిల్లా మాగీ ని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.