మురికి నీటి యంత్రాలను ఉపయోగించడం మేలు
నాగోలు శుద్ధి కేంద్రాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవనం అవుతుందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో కాంగ్రెస్‌కు మూటలు మోయడానికి రేవంత్ రెడ్డి దొరికాడని చెప్పారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మూసీ బఫర్ జోన్‌లో ఉన్నవాళ్లను కబ్జాదారులని రేవంత్ ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాగోల్‌లోని ఎస్టీపీని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నాగోల్‌లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించామని చెప్పారు. ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. రేవంత్ రెడ్డి కొత్తగా చేసేదేం లేదన్నారు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలన్నారు. మూసీ నది హైదరాబాద్ ఒక వరమని, దానిని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలేనని చెప్పారు.
హైదరాబాద్‌లో రోజూ 20 కోట్ల లీటర్ల మురికినీరు ఉత్పత్తవుతున్నదని తెలిపారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే నగరం లేదని వెల్లడించారు. మురుగునీటిని వంద శాతం శుద్ధి చేస్తున్నది ఒక్క హైదరాబాద్‌లోనేనని చెప్పారు. కేసీఆర్ హయాంలోనే ఈ ఘనతను సాధించామన్నారు. రూ.3,800 కోట్ల ఖర్చుతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. నగరంలోని 54 నాలాల నుంచి మూసీలోకి మురికి నీరు వస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన ఎస్టీపీలను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో 57.7 కిలోవిూటర్లు మూసీ ప్రవహిస్తుందన్నారు. మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. బ్రిడ్జిల నిర్మాణానికి రూ.545 కోట్లు మంజూరు చేశామన్నారు. రోడ్ కం బ్రిడ్జ్ కం చెక్ డ్యాం నిర్మించాలనుకున్నామని చెప్పారు. ఎంత శుద్ధి చేసినా మూసీ నీళ్లు తాగేవి కాదని చెప్పారు. అందువల్ల కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీకి నీళ్తు తేవాలని నిర్ణయించామన్నారు. గోదావారి నుంచి నీళ్లు తెచ్చేందుకు రూ.1100 కోట్లతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఆ ప్రాజెక్టుకు గతేడాది మే 18న శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని చెప్పారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవం అవుతుందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. దిల్లీలో కాంగ్రెస్‌కు మూటలు మోయడానికి రేవంత్ రెడ్డి దొరికాడని చెప్పారు. రేవంత్ తన కుర్చీ కాపాడుకోవడానికి కావాలంటే చందాలిస్తామన్నారు. 2400 కిలోవిూటర్ల పొడవైన నమామి గంగే ప్రాజెక్టు కోసం ప్రధాని మోదీ రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారని, మూసీ కోసం రేవంత్ కిలోమీటర్‌కు రూ.2700 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మూసీకి రెండువైపుల రిటెయినింగ్ వాల్ కట్టాలని సూచించారు. మూసీ మీద ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని చెప్పారు.
ముఖ్యమంత్రి గ్రాఫిక్స్ మాయాజాలానికి ఎవరూ ఆగం కావొద్దన్నారు. మూసీలోని మురికి నీరు ఎస్టీపీలో ఎలా శుభ్రం అవుతుందో కేటీఆర్ చూపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటును కేటీఆర్ చేపట్టారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. రూ.3800 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడిరచారు. స్వచ్ఛమైన నీరు మూసీలోకి వొదలాలని ఈ ఎస్టీపీలను నిర్మిస్తున్నామని తెలిపారు. మూసీపై 15 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని భావించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టుపై డీపీఆర్ లేదని, ఎస్టిమేషన్ లేదని విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడితే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.