-
ఉద్యోగాలిచ్చినా.. నిరుద్యోగులకు దూరమయ్యాం
-
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ప్రయివేటు రంగంలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించామని, అయినప్పటికీ నిరుద్యోగులకు, యువతకు దూరం అయ్యామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఐదారు నెలల కిందట కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలని ఊదరగొట్టిందని, మొత్తానికి అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. తాము అధికారం కోల్పోయినందుకు బాధలేదని, అధికారం శాశ్వతం కాదని, మార్పు అని ఓటేసిన పాపానికి.. గత ప్రభుత్వంలో ఏం జరిగింది..? ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది..? అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
నిరుద్యోగులు, యువతకు మేం దూరమయ్యామని, గత పదేండ్లలో దేశంలో ఎక్కడా చేయని విధంగా ఉపాధి కల్పన కల్పించామన్నారు. 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని ఉద్యోగ నియమాకాలు జరిగాయో లెక్కలతో సహా ముందు పెడుతామని, ఈ దేశంలో ఇంతకంటే గొప్పగా ఉపాధి కల్పన జరగలేదన్నారు. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పండి అని అడిగితే కాంగ్రెస్, బీజేపీ నాయకుల వద్ద సమాధానం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేసినప్పటికీ ఈ ప్రభుత్వం పని చయలేదని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని, చదువుకున్న యువత ఈ వాదనకు ఆకర్షితులై బీఆర్ఎస్కు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాను చేయడమే కాకుండా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశామని, వైద్య విద్య చదవే అవకాశం దొరికిందని, కొత్తగూడెంలో కూడా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఖమ్మంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు.