మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఆయన ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ అంతర్జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఈ సదస్సుకు కేటీఆర్‌ను ముఖ్యవక్తగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే థీమ్‌తో ఈ ఏడాది సదస్సు జరగనుంది. ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేథీ మాట్లాడుతూ.. కేటీఆర్ తన అనుభవాలు, ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు, నిపుణులతో పంచుకుంటే, భారత అభివృద్ధి ప్రస్థానంలో భాగం కావడానికి వారందరికీ స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు.
ప్రపంచ సమస్యల పరిష్కారం, స్థిరమైన అభివృద్ధికి సాంకేతికతల పాత్రపై ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలు, సాంకేతిక ఆధారిత అభివృద్ధి నమూనాలను కేటీఆర్ వివరించనున్నట్లు వెల్లడించారు. కేటీఆర్ ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ప్రపంచంపై భారతదేశ సానుకూల ప్రభావం, నాయకత్వ లక్షణాలు బలంగా చాటవచ్చని సిద్ధార్థ్ సేథీ పేర్కొన్నారు. కాగా, యూరప్‌లో భారత్‌కు సంబంధించిన అతిపెద్ద కార్యక్రమాల్లో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ ఒకటి. భారతదేశ పురోగతి, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో మార్పులు, ప్రపంచ సహకార అవకాశాలపై చర్చలు జరుగుతాయి. భారతదేశాన్ని ప్రపంచానికి చేరువ చేయడం, పరిశోధన, సాంకేతికత, విధానాల్లో ఇతర దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ ఫోరమ్ లక్ష్యం.
ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఐటీ మంత్రిగా పని చేసిన కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ మహా నగరంలో అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలను స్థాపించడంలో ఆయన కృషి చేశారు. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. ఐటీ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపారు. ఐటీ రంగం ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడంలో కేటీఆర్ విశేషంగా కృషి చేశారు.