Thursday, January 9, 2025

కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్

ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

రైతు బంధుపై కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు రూ.15 వేలు కాకుండా రూ.12 వేలు ఇస్తున్నారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, అవినీతిపై ప్రశ్నిస్తున్నారన్న కారణంగానే కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. హైకోర్టు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ మంగళవారం కొట్టివేసిన అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ లోని నందినగర్‌ కేసీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టినా వదిలిపెట్టేది లేదని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు, కుట్రలు, అక్రమ కేసులతో తాము వెనక్కి తగ్గుతామని రేవంత్ అనుకుంటున్నారన్నారు. రేవంత్‌ సర్కారు పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని, హైకోర్టు కేవలం ఏసీబీని కేసు విచారణ కొనసాగించాలని చెప్పిందని, అంతేగానీ ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి అనే అంశమే లేదన్నారు.
రేవంత్ రెడ్డి ఏడాది తరువాత కేటీఆర్ మీద కేసు పెట్టారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని కేటీఆర్ అడుగడుగునా ప్రశ్నించడంతో కుట్రపూరితంగా ఆయన మీద కేసు పెట్టారని హరీశ్‌రావు అన్నారు. ఎలాంటి తప్పు చేయలేదు కనుక విచారణకు ఏసీబీ ఆఫీసుకు వెళ్లారని, కానీ లాయర్లను అడ్డుకుని హక్కులు ఉల్లంఘించడంతో కేటీఆర్ తిరిగి వచ్చేశారని వివరించారు. ఫార్ములా ఈ కారు రేసును తమ రాష్ట్రాలకు రాలేదని, తెలంగాణ గ్రేట్ అని అంతా కొనియాడారని, న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలపక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, అధైర్యపడే ప్రసక్తే లేదని, కేసు విచారణకు కేటీఆర్ సహకరిస్తున్నా దుష్ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు చూస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.

మాకు నమ్మకం ఉంది
న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, కానీ రేవంత్ రెడ్డిపై నమ్మకం లేదని, కేసు ఓడిపోయారని, హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నట్లు కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్లుగా ఇది తుఫేల్ కేసు అని, ఫార్ములా ఈ రేసుతో తెలంగాణ బ్రాండ్ ఇమేజీ వచ్చిందన్నారు.

కచ్చితంగా కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారు
ఈ కారు రేసె కేసులో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని, ఈరోజు అరెస్ట్ చేస్తారో, రేపు అరెస్ట్ చేస్తారో అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు అరెస్టయ్యామని, కేసీఆర్ అరెస్టయ్యి వరంగల్ జైలుకు వెళ్లారని, ఫలితంగా రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఏదో రోజు కేటీఆర్‌ను అక్రమ అరెస్ట్ చేస్తారని, రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసుకు అడ్వకేట్ లేకుండా వెళ్లారా? అని ప్రశ్నించారు. ముఖ్యనేతలం సమావేశమై పార్టీపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తామని, అంతేగానీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను మాత్రం ప్రశ్నించడం ఆపమని, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ప్రత్యేకంగా రాకపోతే గ్రీన్ కో కు ప్రయోజనం ఎలా చేకూర్చినట్లు అని ప్రశ్నించారు. గ్రీన్ కో సొంత డబ్బులు పెట్టి ఫార్ములా ఈ రేసు నిర్వహించిందని, ఇందులో రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పి ఏంటి అని నిలదీశారు. ఏసీబీ నోటీసులు వస్తే కేటీఆర్ నిజాయితీగా విచారణకు వెళ్లారని, ఈ నెల 9న మరోసారి విచారణకు హాజరవుతారని మాజీ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com