గుడిసెలు, షాపులు కూల్చడమంటే పేదల పొట్ట కొట్టినట్టే
బుల్డోజర్లతో హంగామా సృష్టించాలా?
రూ.200 కోట్లకు పైగా ప్రజా ధనం వృథా
ప్రభుత్వంపై కెటిఆర్ ఆగ్రహం
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్, ములుగు జిల్లాల పర్యటనకు రానున్నారని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా? అని రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రోజువారీ కూలి పనులు చేసుకుని జీవించే నిరుపేద ప్రజల ఇళ్లతో పాటు వారి జీవనోపాధిని దెబ్బతీయడానికి చేస్తున్నఈ ప్రయత్నం వెనుక కారణమేంటి ? వరంగల్‌లో కూల్చివేతలు ఎందుకు జరుగుతున్నాయంటూ రాహుల్‌ను ప్రశ్నించారు.
మిస్‌వరల్డ్ పోటీలో పాల్గొన్న వారు ప్రయా ణించే మార్గాన్ని మరింత సుందరంగా చేయడానికే ఈవిధంగా చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు ఔచిత్యమని కె.టి.ఆర్. ప్రశ్నించారు. ఈవిధంగా చేస్తూ తమది ప్రజాపాలన అని ఏవిధంగా చెప్పుకోగలుగు తున్నారని నిగ్గదీశారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న సుందరీమణులు మే 14న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వెయ్యి స్తంభాల గుడి, రామప్ప టెంపుల్ లాంటి ప్రముఖ కట్టడాలను సందర్శిస్తారు. వీరు వస్తున్న నేపథ్యంలో వారు ప్రయాణించే రోడ్డు పక్కన ఉన్న పేదల గుడిసెలు, వారి చిన్న చిన్న షాపులను సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కె.టి.ఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒకవైపు రాజభవనాలలో విలాసవంతమైన విందులు, ఇతర్రతా ఖర్చుల పేరుతో రూ. 200 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని వృథా ఖర్చు చేశారు. మరోవైపు బుల్డోజర్లతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని మేం అడుగుతున్న ప్రశ్నకు సమాధానాలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.