డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను అంటూ కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు తనకు ఆహ్వానం దక్కకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడుని అయినందుకే ఇలా జరిగిందని.. ప్రజా ప్రతినిధి అయి ఉండి తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. సరస్వతీ పుష్కరాల గురించి చెప్పాలంటే నిజంగా చాలా బాధేసిందని, తన హక్కుల కోసం పోరాడిన దళిత నేతలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని వంశీ చెప్పుకొచ్చారు. అందరి ఐకమత్యం, వారి మద్దతుతో తన హక్కులు పోరాడి సాధించుకున్నానని, ఈ రోజు చాలా ముఖ్యమైన విషయం తాను నేర్చుకున్నానని, డబ్బు కంటే కులమే గొప్పదని నాకు జరిగిన సంఘటనతో తెలిసొచ్చిందన్నారు. కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశానని, సరస్వతీ పుష్కరాలకు ఆహ్వానించకపోవడంతో చాలా బాధపడ్డానన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడతాం..
రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలకు వెళ్లొచ్చని మరొకసారి గుర్తుచేస్తున్నానని, రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ఆర్టికల్ 15బీ, ఆర్టికల్ 17 అంటరానితరం నేరమని.. మత, ప్రార్థనా స్థలాలలో అందరికీ సమాన అవకాశం ఉంటుందని, ఎవరిపై వివక్ష చూపకూడదని కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అన్నారు. అంటరానితనం, కుల వివక్ష, ఇతర వివక్షలపై రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల ద్వారా పోరాటాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
ఎంపీ నియోజకవర్గంలోనే పుష్కరాలు
సరస్వతీ పుష్కరాలను ఈ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 15 వతేదీన కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుష్కరపూజ నిర్వహించారు. ఐటీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఆయన నియోజకవర్గంలోనే పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కరాలు జరుగుతున్న ప్రాంతం ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి పరిధిలోేనే ఉంది. మరి ప్రభుత్వం తరపున అధికారిక కార్యక్రమం నిర్వహించినప్పుడు.. ప్రోటోకాల్ అధికారులు తప్పనిసరిగా స్థానిక ఎంపీకి ఆహ్వానం ఇస్తారు. అయితే ప్రోటోకాల్ విభాగం కాకుండా ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైనాా విస్మరించారా.. అందుకే ఎంపీ నొచ్చుకున్నారా అన్నది తెలియడం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ.. జిల్లా మంత్రి నుంచి కానీ ఆహ్వానం అందనందునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనుకుంటున్నారు.