- ఫాంహౌస్‌లో ఒక్క అంగుళం ఉన్నట్లు తేల్చండి
- సీఎం రేవంత్‌కు కేవీపీ లేఖ
హైదరాబాద్ అజీజ్‌నగర్‌లో తన కుటుంబ సభ్యుల పేరు మీదున్న ఫార్మ్‌హౌస్‌లో ఎఫ్‌టీల్, బఫర్ జోన్లలో ఒక్క అంగుళం ఉన్నట్లు అధికారులు సర్వేలో తేల్చినట్లయితే తక్షణమే సొంత ఖర్చులతో కూల్చేస్తామని మాజీ రాజ్యసభ సభ్యడు కేవీపీ రామచందర్ రావు వెల్లడించారు. ఇవాళ తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫార్మ్‌హౌస్‌పై స్వార్థం కోసం ప్రతిపక్ష నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం భుజంపై తుపాకీ పెట్టి తనను కాల్చాలని, తద్వారా సీఎంను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారని తాను రేవంత్ రెడ్డికి రాసిన మూడు పేజీల సుదీర్ఘ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు.
ఇచ్చిన మాట ప్రకారం నేనే కూల్చేస్తా
సీఎం అయిన రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి, ప్రతిపక్షాలు తనను, తన కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఫార్మ్ హౌస్‌ను పావుగా వాడుకోవడం మనోవేదన కలిగిస్తోందని కేవీపీ లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం, ఆ ఫార్మ్‌హౌస్‌లో ఏ కట్టడమూ ఎఫ్‌టీఎల్ పరిధిలోకి గానీ, బఫర్ జోన్ పరిధిలో లేవన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు తనపై ఆరోపణలు చేసినప్పుడు ఆగస్టు 20వ తేదీనే ఓ టీవీ ఇంటర్వ్యూలో ఫార్మ్ హౌస్‌లో ఒక్క అంగుళం కట్టడం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నా సొంత ఖర్చులతో కూల్చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ రోజునే చెప్పినట్లు వెల్లడించారు. తాను, తన కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.
నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తనకు ఏలాంటి మినహాయింపులు వద్దని కేవీపీ స్పష్టం చేశారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏ విధంగా వ్యవహరిస్తుందో అదే చాలని, తాను, సీఎం కానీ కలుగచేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకుని పోనిస్తామని లేఖలో సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణను తాను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి పార్టీ శ్రేయోభిలాషులు కొందరు మొదటి దశలో మూసీ ప్రక్షాళన, రెండో దశలో సుందరీకరణ చేపడితే బాటుందని ఆ విషయాన్ని సీఎంకు సూచించాలని తనను కోరినా మూసీ సుందరీకరణపై సీఎం ఆసక్తిని గమనించి, ఆయన ఆలోచన, విజన్, సమర్థతపై నమ్మకంతో పార్టీ నాయకులు చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లలేదని వెల్లడించారు. పేదలకు నష్టం కలుగకుండా ప్రభుత్వం చేపట్టే అన్ని పనులకు ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీ నాయకులు వారి పెంపుడు మీడియా కానీ పేదలకు అన్యాయం పేరుతో మాట్లాడేవి వారి స్వప్రయోజనాల కోసమేనని ఆరోపించారు.
సీఎం ఆశయాన్ని దెబ్బతీసే ప్రయత్నం
దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, పేదల అభివృద్ది, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ మౌళిక సిద్దాంతమన్న ఆయన మూసీ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనన్న విషయం ప్రజలందరికి తెలుసన్నారు. ఈ విషయంలో సీఎం ఆశయాన్ని దెబ్బతీయడానికి వారి చేసే ప్రయత్నాలను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అజీజ్‌నగర్‌లో తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫార్మ్‌హౌస్‌పై స్వార్థం కోసం ప్రతిపక్ష నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారని, సీఎం భుజంపై తుపాకీ పెట్టి తనను కాల్చాలని, తద్వారా సీఎంను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారని విమర్శించారు.
వీలు చూసుకుని సంబంధిత అధికారులను తన ఫార్మ్ హౌస్‌కు పంపించాలని, చట్ట ప్రకారం అక్కడ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిని మార్క్ చేస్తే, ఏదైనా కట్టడం మార్క్ పరిధిలో ఉంటే 48 గంటల్లో సొంత ఖర్చులతో తమ కుటుంబ సభ్యులు కూలుస్తారని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అయితే మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఆ మార్కింగ్ చేసే సమయం, తేదీ ముందే ప్రకటిస్తే తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియా కూడా వచ్చి ఈ ప్రక్రియను వీక్షించే అవకాశం ఉంటుందని వివరించారు. 1980 నుంచి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పర్చుకుని అప్పటి నుంచి ప్రతి ఎన్నికలో ఓటరుగా పాల్గొంటున్నానని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు, తన మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో వనరులు సమకూర్చుతూ వారి గెలుపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
పార్టీకి నష్టం కలిగించే పని చేయను
క్రమశిక్షణ, నిబద్దత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ప్రాంతాలకు అతీతంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ బలోపేతానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. తన వల్ల పార్టీకి నష్టం కలిగించే ఏ పని తాను చేయనని, చేయలేనని స్పష్టం చేశారు. ఇది తాను, డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి దాదాపు మూడు దశాబ్దాల కిందట 1996లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తన తుది ఊపిరి ఉన్నంత వరకు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 1984 నుంచి ఇప్పటి వరకు ఏఐసీసీ సభ్యుడిగా ఉంటూ దాదాపు 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో నిబద్దత కలిగిన కార్యకర్తగా తాను కొనసాగుతున్నానని తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని, పథకాన్ని త్రికరణ శుద్ధిగా సమర్ధిస్తానని వివరించారు. తాను ప్రభుత్వ నిర్ణయాలను చిత్తశుద్దితో అమలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఇవాళ ఓ కాంగ్రెస్ సీఎంకి చెప్పాల్సి రావడం బాధాకరమే అయినా తప్పలేదని పేర్కొన్నారు.