తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా కేవలం 15 రోజుల సమయంలోనే ఏకంగా 4,500కు పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఏ-4 నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై జరిగిన వాదనల సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబరు 15 నుంచి 30 తేదీల మధ్య పెద్ద సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేసినట్లు కోర్టుకు చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్, వొడా ఫోన్, జియో నెట్‌వర్క్‌లకు సంబంధించిన రికార్డులు లభించగా, మరిన్ని వందల ఎయిర్‌టెల్ ఫోన్ల ట్యాపింగ్ డేటాను నిందితులు పూర్తిగా ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది.
రేవంత్‌రెడ్డి సహా ఇతర నేతల, వ్యాపారుల ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించిన సుమారు 340 జీబీ మేర సమాచారాన్ని దర్యాప్తు క్రమంలో పోలీసులు వెలికితీసినట్లు తెలుస్తోంది. ఈకేసులో కీలక నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు లను విదేశాల నుంచి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. వారిద్దరిపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ కోసం సీబీఐ ద్వారా ఇంటర్ పోల్‌కు నివేదిక పంపించారు.
వారిని విచారించడం ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కోర్టులో చార్జి షీట్ దాఖలు చేయగా, త్వరలోనే అడీషనల్ చార్జి షీట్ దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు