దేశ సంపదను, ఆర్థిక సంస్థలను మోసగిస్తున్న అదానీపై జెపిసి వేసి చట్టపరమైన విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాజ్ భవన్ వద్ద అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. అదానీపై జెపిసి వేసి చట్టపరమైన విచారణ చేపట్టాలని దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటులో కోరినా పట్టించుకోక పోవడంతో ఈ దేశ ప్రజల కోసం పిసిసి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ దేశ, రాష్ట్ర సంపదను, వనరులను బిజెపి నాయకత్వానికి దగ్గరగా ఉండే కొద్ది మంది క్రోనీ కాపిటల్స్ కు దోచి పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఎన్నికల ముందు తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా వివరించిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ దేశ, రాష్ట్ర సంపద, వనరులు ఇక్కడి ప్రజలకు ఉండాలని పాదయాత్ర సందర్భంగా ప్రతి చోటా తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ సహకారంతో అదాని ఈ దేశంలో చేస్తున్న దోపిడీ తీరును వివరించేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమం తీసుకుందని తెలిపారు. ప్రజాస్వామ్య దేశాన్ని అదానీ ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలను ఏ విధంగా మోసగిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, హిడెన్ బగ్ లాంటి సంస్థలు బహిర్గతం చేశాయని తెలిపారు. అదానీని, ఆయన కంపెనీలు, వ్యాపారాలను విచారించాలని పార్లమెంట్లో గత కొద్ది రోజులుగా దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
అక్కడ స్పందన లేకపోవడంతో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు నేడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. నిరసన దీక్షలో భాగంగా గవర్నర్ కు వినతి పత్రం సమర్పించామని.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చేపట్టిన కార్యక్రమానికి ఈ దేశ, రాష్ట్ర ప్రజలు పద్ధతి ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు.