- తుక్కుగూడలో 1500కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం
- రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభం..
- 1,600 మందికి ఉపాధి వివరాలు వెల్లడించిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
- యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్న మంత్రి
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులున్నాయని, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘‘తెలంగాణ రైజింగ్’’లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. కాగా లెన్స్‌కార్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లజోడు తయారీ కేంద్రాన్ని రూ.1500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చొరవతో తుక్కుగూడలోని నాన్-సెజ్ జనరల్ పార్క్‌లో ప్రారంభమయ్యే ఈ ప్లాంట్ ద్వారా సుమారు 1600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రెండేళ్లలో ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. నాలుగేళ్లలో పూర్తిగా కార్యకలాపాలు మొదలవుతాయి. ఈమేరకు గురువారం ప్లాంట్ నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, లెన్స్‌కార్ట్ మధ్య గతేడాది డిసెంబర్ 8న ఎంవోయూ జరిగింది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు జపాన్, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతి అవుతాయి.
ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది.
లెన్స్ కార్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద కళ్లజోడుల తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. దీంతో తెలంగాణ బ్రాండ్ విశ్వ వ్యాప్తం అవుతుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గతేడాది డిసెంబర్ 8న ఒప్పందం కుదిరింది. ఇప్పటికే లెన్స్‌కార్ట్ కు రాజస్థాన్‌లో అధునాతన కళ్లజోడు తయారీ యూనిట్ ఉంది. కానీ.. మన దగ్గర ఏర్పాటు కాబోయే ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్దది. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ తెలంగాణ కు తలమానికం అవుతుంది. తయారీ రంగంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తుంది. రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఈ ప్లాంట్ కు ప్రభుత్వం తరఫున తుక్కుగూడ సమీపంలో రావిర్యాలలో 50 ఎకరాలు కేటాయించాం. రెండేళ్లలో ఈ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. నాలుగేళ్లలో పూర్తిగా కార్యకలాపాలు మొదలవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, లెన్స్ కార్ట్ ప్రతినిధులు చౌదరి, సుమిత్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.