* రక్షణ శాఖ భూముల కేటాయింపులకు కేంద్రం అనుమతులు
* హైదరాబాద్ రామగుండం, నాగ్ పూర్ హైవే రూట్ క్లియర్
* ఉత్తర తెలంగాణకు విస్తరించనున్న రవాణా సదుపాయాలు
* కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు
టీఎస్, న్యూస్: హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్– నాగపూర్జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం ఉదయం అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన కారిడార్ల నిర్మాణానికి అనుమతించినందుకు సీఎం… ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్, -రామగుండం ను కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగు రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరమని రక్షణ శాఖ మంత్రికి విజ్క్షప్తి చేశారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్-44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని, అందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్రం అనుమతులు మంజూరు చేసింది.
కేంద్రం ఇచ్చిన అనుమతులతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది. అటు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్ రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలోని అత్యంత ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్య తొలిగిపోనుంది. హైదరాబాద్ నుంచి శామీర్‌పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర దిశగా అభివృద్ది పరుగులు తీయనుంది. జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి అడ్డంకిగా మారిన రక్షణ శాఖ భూముల అడ్డంకులు తొలిగిపోయాయి.