వయసు కేవలం 9ఏళ్లు.. తన సన్నని గొంతుకతో పాట పాడితే.. ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే. నిజానికి ఈ చిన్నారి మూడేళ్ల వయసునుంచే సంగీత సాధన చేస్తోంది. అంటే సరైన మాటలు కూడా రాని వయసులోనే ఈ చిన్నారి స..రి..గ..మ..లు నేర్చేసిందన్నమాట. ఇంతకీ ఎవరీ చిన్నారి..? తన పేరేంటో..? ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ చిట్టితల్లి పేరు అక్షరా గోపానపల్లి. వీళ్లది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబమే కాదు. కానీ, తల్లీదండ్రులు సింధూర, సాగర్‌ల ప్రోత్సాహం మేరకు ఈ చిన్నారి సంగీతంలో రాణిస్తోంది. తమ కుమార్తెను ఓ సింగర్‌లా చూడలనుకున్నారు. ఆమేరకు అక్షరాకు సంగీతంలో తర్ఫీదులు ఇప్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రుల కోరికే కాదు.. ఈ చిన్నారి కూడా సంగీతంపై మక్కువ చూపడంతో.. సరిగమలను ఓ పట్టు పట్టేస్తూ.. ప్రదర్శనలు కూడా ఇస్తోంది. తన పాట విన్న వారిని మైమరిచేలా చేస్తోంది. అమ్మనాన్నల ప్రోత్సాహంతో మూడేళ్ల వయసు నుంచే పాడటం మొదలు పెట్టింది. కేవలం పాడటమే కాదండోయ్.. తన పాటలతో శ్రోతలనూ మెప్పిస్తోంది.
నిత్య సాధనలో బిజీ..
అయితే, అక్షరా తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొలో నివాసం ఉంటుంది. అక్కడే పుట్టి మన భారతీయ మూలాలు, దక్షిణ భారత సంగీతంలో ప్రావీణ్యం సాధించింది. అమెరికాలోనే తన గాత్ర మాధుర్యాన్ని వినిపిస్తూ.. పెరుగుతోంది. అక్కడ జరిగే తెలుగు ఫెస్టివల్స్‌లో పాడుతూ.. అందర్ని మొప్పిస్తోంది. అలాగే, నిత్యం సాధన చేస్తూనే ఉంటుంది.
యూట్యూబ్‌లోనూ దూకుడు..
తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, అందులో తను పాడిన వీడియోలను అప్‌లోడ్ చేస్తోంది. ఇలా తన గాత్ర మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది ఈ చిన్నారి. అలాగే, తెలుగు ఎంటర్టైన్‌మెంట్ ఛానల్స్ పెట్టే సింగింగ్ కాంపిటేషన్స్‌లోనూ పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ చిన్నారిని పాడుతా తీయగా, లిటిలి ఛాంప్స్ లాంటి ప్రోగ్రాంలో కంటెస్టెంట్‌గా చూసే అవకాశం కూడా ఉంది. ఈ చిన్నారి పాడిన కొన్ని పాటలను ఇక్కడ వినొచ్చు.