Wednesday, January 8, 2025

కేసీఆర్‌ ‌సారూ.. ఓసారి ద‌ర్శ‌న‌మివ్వ‌రూ..!

మా మనసులోని బాధల్ని చెప్పుకోవాలంటున్న క్యాడ‌ర్‌..
13నెలలుగా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే కేసీఆర్‌.. లోకల్‌ ‌లీడర్లకు నో ఎంట్రీ
ఫాంహౌస్‌లోకి ‘కోటరీ’సెలెక్టెడ్‌ ‌నేతలకే ప్ర‌వేశం
వోట్లేసి గెలిపించినోళ్లకు యేండ్లు, నెలలైనా దక్కని దర్శన భాగ్యం
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, నిరుత్సాహంలో క్యాడర్‌
4 నెలలుగా ఖాలీగా ఉన్న మనోహరాబాద్‌ ‌మండల అధ్యక్షుడి పోస్టు
ఇదీ గజ్వేల్‌ ‌నియోజకవర్గ గులాబీ ముఖ చిత్రం

బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో యేండ్లుగా పని చేస్తున్నాం. పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఎన్నో వ్యయప్రయాస‌లకు గురై వరుసగా గజ్వేల్‌ ‌నుంచి మూడు పర్యాయాలు కేసీఆర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ను దూరంగా చూడడమే తప్ప ఏనాడూ దగ్గర నుంచి చూసిందీ లేదు. ఆయనను ప్రత్యక్షంగా కలిసిందీ లేదూ. కేసీఆర్‌ను ఏ ఒక్క రోజూ ఆత్మీయంగా కలిసే అవకాశం దక్కలేదు. యేండ్లయినా కేసీఆర్‌ను కలిసే దర్శన భాగ్యం కలగడం లేదు. కేసీఆర్‌ను ఒక్కసారి కలవాలని ఉంది. మేము పడుతున్న బాధలను కేసీఆర్‌తో పంచుకోవాలని ఉంది. అని కేసీఆర్‌ను గెలిపించిన గజ్వేల్‌ ‌నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కోసం ముఖ్యంగా గజ్వేల్‌లో కేసీఆర్‌ ‌గెలుపుకోసం కష్టపడ్డోళ్లు మాట్లాడుతున్న మాటలు ఇవీ.. కాదు, కాదూ వారి మనసులో నుంచి తన్నుకొస్తున్న ఆవేదన, ఆక్రంద‌న‌. కేసీఆర్‌ను మూడుసార్లు గెలిపించినా కూడా ఒక్కసారి కూడా కలవని ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్లు, తెలంగాణ ఉద్యమకారులెందరో గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో ఉన్నారు.

ఒక్కసారి ‘పెద్దసార్‌’(‌కేసీఆర్‌)‌ను కలిపియ్యండంటూ పార్టీ సీనియర్లు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఎంత బతిమిలాడినా కూడా ఫాంహౌస్‌లో కేసీఆర్‌ ‌చుట్టూ ఉండే ‘కోటరీ’మాత్రం కేసీఆర్‌ను కలిపించ‌క‌పోవ‌డంతో ఆవేదనతో పార్టీని వీడిన సీనియర్లు, కార్యకర్తలు ఎందరో ఉన్నారు. కేసీఆర్‌కు సమకాలీనులు, అత్యంత ఆప్తులు, దగ్గరి మిత్రులుగా పేరున్న మడుపు భూంరెడ్డి, గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా డిసిసిబి ఛైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌ ‌మునిసిపల్‌ ‌మాజీ ఛైర్మన్‌ ‌గాడిపల్లి భాస్కర్‌ ‌తదితర సీనియర్‌ ‌నేతలెందరో కారు దిగి ‘హస్తం’గూటికి చేరుకున్నారు. అయినా కూడా కేసీఆర్‌ ‌మాత్రం పార్టీని వీడుతున్న వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. అన్నీ చంపుకోని పార్టీలో ఉంటున్న వాళ్లతో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. కేసీఆర్‌ ‌చుట్టూ ఉన్న ‘కోటరీ’(భజనపరులు)సెలెక్ట్ ‌చేసిన నియోజకవర్గంలోని ఓ ఐదారుగురు నేతలు మాత్రమే అది వారి పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్‌ను కలిసే చాన్స్ ఇచ్చారు. తప్పిస్తే మరెవరూ కూడా కేసీఆర్‌ ‌దర్శన భాగ్యానికి నోచుకోలేదనీ ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి 13నెలలు దాటింది.

ఈ 13నెలలుగా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఉంటున్న కేసీఆర్‌ను కలిసేందుకు గత కొన్ని నెలలుగా చేయని ప్రయత్నమంటూ లేదనీ, ఎవరూ కూడా కేసీఆర్‌ను కలవనివ్వడం లేదనీ, తనలాంటి వారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య కార్యకర్త కేసీఆర్‌ను ఎప్పుడు కలుస్తాడనీ, ఎన్నో వ్యయప్రయాస‌లకు ఓర్చి వరుసగా మూడు పర్యాయాలు వోట్లేసి గెలిపించిన గజ్వేల్‌ ‌కార్యకర్తలకూ కేసీఆర్‌ ‌దర్శన భాగ్యం ఉండదా? అని జగదేవ్‌పూర్‌ ‌మండలానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్‌ఎస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు ఒకరు మంగళవారం ‘ప్రజాతంత్ర’తో అన్నారు. తన మనసులోని బాధను, ఆవేదనను వెల్ల‌బోసుకున్నారు. ‘నా లాంటి సీనియర్లు ఎందరో కేసీఆర్‌ను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది, దీనికంతటికీ కారణం కేసీఆర్‌ ‌చుట్టూ ఫాంహౌస్‌లో ఉన్న ‘కోటరీ’అని ఆ నేత చెప్పారు. కేసీఆర్‌ ‌చుట్టూ ఉన్న ‘కోటరీ’ కేసీఆర్‌కు గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను తెలియనివ్వడం లేదనీ, కేసీఆర్‌ను కలిపిస్తే ఆ కోటరీ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయం ఆ కోటరీలో బలంగా ఉన్నట్లు పార్టీ శ్రేణులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. వారి బండారం బయటపడకుండా ఉండటానికే కేసీఆర్‌ ఎప్పుడూ బిజీ అని…తర్వాత చూద్ధాం అంటూ చెబుతూ తప్పించుకుని తిరుగుతున్నారనీ, దీంతో కేసీఆర్‌ అం‌టే పిచ్చి ప్రేమ, అభిమానం ఉన్న ఎందర్నో కేసీఆర్‌కు దూరం చేసిన ఘనత ఆ కోటరీకి దక్కుతుందని అంటున్నారు. మొత్తానికి అందరూ చెబుతున్న మాట మాత్రం ఒకటే.. కోటరే కేసీఆర్‌, ‌గజ్వేల్‌లో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కొంప ముంచుతుందంటున్నారు.

పిలిచి మాట్లాడని కేసీఆర్‌…‌రగిలిపోతున్న క్యాడర్‌..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం వోటర్ల జాబితాను కూడా విడుదల చేసింది. అయితే, గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో మాత్రం బిఆర్‌ఎస్‌ ‌నాయకత్వం అనుసరిస్తున్న వైఖరిపై పార్టీ శ్రేణులు తీవ్రమైన అసంతృప్తి, ఆవేదన, ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలో సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు, పలువురు ఉద్యమకారులు ఇప్పటికే బిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. త్వరలో మరి కొందరు కూడా పార్టీని వీడే అవకాశం ఉందని అత్యంతమైన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మనోహరాబాద్‌ ‌మండల పార్టీ అధ్యక్షుడు మహేష్‌ ‌పార్టీకి రాజీనామా చేసి నాలుగు నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు మనోహరబాద్‌ ‌మండలానికి పార్టీ కొత్త అధ్యక్షుడిని నియమించని పరిస్థితుల్లో ఉంది. దిశానిర్దేశం చేసే వారెవరూ లేకపోవడంతో నాయకులు, కార్యకర్తలు ‘ఎవరికి వారే యమునా తీరు’అన్న చందంగా వ్యవహరిస్తుండటంతో పార్టీలో ఉన్నవాళ్లు సైతం పార్టీలో ఉండాలా? పార్టీని వీడాలా? అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థలు వొస్తున్నాయి. స్థానిక సంస్థలకు సిఎం రేవంత్‌రెడ్డి, టిపిసిసి చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌గౌడ్‌ ‌పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేస్తుండటంతో గజ్వేల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వం సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు స‌మాచారం. మరోవైపు బిజెపి కూడా చాపకింద నీరులా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో ఎంపి మాధవనేని రఘునందన్‌రావు రూపంలో దూసుకెళ్తున్నారు. అయితే, బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో మాత్రం పార్టీ నాయకత్వానికి, క్యాడర్‌కు మధ్య కొంత గ్యాప్‌ ఏర్పడటంతో ఎలా ముందుకు వెళ్లాలనేది తెలియక, వారికి స‌రైన‌ సమాచారం ఇవ్వకపోవడంతో కార్యకర్తలు మాత్రం ఒకింత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏమిటి? అంటూ శేఖర్‌గౌడ్‌ ‌నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ కార్యకర్తలు తమ మనసులోని గోడును వెళ్లబోసుకున్నట్లు సమాచారం. మిగతా మండలాల్లోనూ పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు సైలెంట్‌గానే ఉంటున్నారు.

ఇదిలా ఉంటే, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ‘పత్తా’లేకుండా పోయారు. ఇంత జరుగుతున్నా కూడా ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌ ‌మాత్రం గజ్వేల్‌ ‌నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలను మాత్రం పిలిచి మాట్లాడటం లేదు. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నీ తానై కార్యకర్తలు ‘చే’జారిపోకుండా సర్వశక్తులు వొడ్డుతుండగా…ఆయనకు తోడుగా ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌వంటేరు యాదవరెడ్డి, ఎఫ్‌డిసి మాజీ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి మేమున్నామంటూ క్యాడర్‌కు భరోసానిస్తున్నారు. అయితే, తాము ఎంతో కష్టపడి గెలిపించిన కేసీఆర్‌ ‌దర్శన భాగ్యం కలగకపోవడంతో పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు మాత్రం తమ మనసులోని ఆవేదనను ఎవరికీ చెప్పుకోలేక లోలోప‌ల కుమిలికుమిలిపోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీ క్యాడర్‌లో జోష్‌ ‌నింపకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గజ్వేల్‌లో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ మరింత మసకబారడం ఖాయమని ఆ పార్టీకి చెందిన కరుడుగట్టిన కార్యకర్తలు, ఉద్యమకారులు అంటున్నారు.

కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌ ‌దాటి బయటకు రావాలంటున్న క్యాడర్‌..
‌పదేళ్ల పాటు బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ‌పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్షనేత. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజోపయోగ కార్యక్రమాలను, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం, అసంతృప్తితో ఉన్న క్యాడర్‌లో ఉత్సాహం, భ‌రోసా నింప‌డంతోపాటు జోష్ తీసుకురావాల్సిన ‌బాధ్యత కేసీఆర్‌పై ఉంది. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా, బిఆర్‌ఎస్‌ అధినేతగా కేసీఆర్‌ అలాంటి పాత్ర పోషించాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ, ఆయ‌న మాత్రం ఇవేవీ పట్టించుకోవట్లేదు. కేవలం ఫాంహౌస్‌కే పరిమితమైపోయారు. ఆయన ఇంకెప్పుడు బయటికొస్తారనే ప్రశ్న ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా సిఎం అయిన కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టడంలో సక్సెస్‌ అయ్యారని చెప్పడంలో సందేహం లేదు. అయితే, ఎమ్మెల్యే ఎన్నికల్లో కేసీఆర్‌ ‌పార్టీని ప్రజలు ఓడించారు. దీంతో ఆయన అప్పటి నుంచి ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు పరిమితమ‌య్యారు.

అయితే, ఆయన గజ్వేల్‌ ఎమ్మెల్యేగా తన పాత్రను సరిగ్గా పోషించట్లేదని అందరూ భావించడమే కాకుండా, మా ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ కాంగ్రెస్‌ ‌నేతలు గజ్వేల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. గజ్వేల్‌ ‌రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసిన గులాబీ బాస్‌ ఇప్పుడు మాత్రం బయటకు వొచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ అం‌దరినీ కలిసి మాట్లాడితే ఉండే వెయిటేజ్‌ ‌వేరు ఉంటుంది. పార్టీ కార్యకర్తలకు వొచ్చే ఉత్సాహం వేరే లెవల్‌లో ఉంటాయి. కాబట్టి కేసీఆర్‌ ‌బయటకు రావాలని చాలామంది కోరుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ అం‌దరితో మాట్లాడాలనీ, బయటకు వొచ్చి అందర్నీ కలిస్తే అనేక సమస్యలకు సమాధానాలు దొరుకుతాయనీ, పరిష్కారమవుతాయని పార్టీ శ్రేణుల అభిప్రాయం, ఆలోచననే కాకుండా, ఆ దిశగా కేసీఆర్‌ ‌నడవాలని కోరుతున్నారు. అయితే, కేసీఆర్‌ ‌కోటరీ(భజనపరులు)చెప్పే మాటలు విని వారి చక్ర‘బంధం’లోనే ఉంటారా? లేదంటే, పార్టీ క్యాడర్‌ ‌కోరుకుంటున్నట్లుగా అందర్నీ కలుస్తూ, వారితో మాట్లాడుతూ సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ముందుకెళ్తారా? అనేది మాత్రం ఆయనకు మాత్రమే తెలుసు. చూడాలి మరి!

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com