-
బిసి కులగణన తరువాతే స్థానిక ఎన్నికలు జరగాలి
-
ప్రభుత్వం కులగణన ప్రక్రియను ప్రారంభించాలి
-
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు
బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సకల జనుల సర్వే రిపోర్టు ఎక్కడ అని కెసిఆర్, కెటిఆర్‌లను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బిసి కులగణన తరువాతే స్థానిక ఎన్నికలు జరగాలన్నారు. ఇప్పటికే సిఎం రేవంత్‌రెడ్డి కులగణన బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారని, కోర్టు కూడా మూడు నెలలలోగా కులగణన రిపోర్టు ఇవ్వాలని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ కూడా బిసి కుల గణనకు పూర్తి మద్ధతు తెలిపారన్నారు.
అయితే, గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో సకల జనుల సర్వే చేసిందని, కానీ, ఇప్పటివరకు ఆ రిపోర్టును మాత్రం బయట పెట్టలేదని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఆ రిపోర్టులు ఎక్కడికి పోయాయంటూ ఆయన కెటిఆర్, కెసిఆర్‌లను ప్రశ్నించారు.
ఇప్పటికైనా పూర్తి స్థాయి డేటాను సిఎస్‌కు అందజేయాలని, ఆ రిపోర్టు ఇస్తే బిసి కులగణనకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సిఎ రేవంత్‌రెడ్డి రూ.150 కోట్లు విడుదల చేస్తే కేవలం రెండు నెలల్లోనే బిసి కుల గణన రిపోర్టు వస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కులగణన ప్రక్రియను ప్రారంభించాలన్నారు. అదేవిధంగా కెసిఆర్, కెటిఆర్‌లకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సకల జనుల సర్వే రిపోర్టును బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బిసి కుల గణన పూర్తయ్యాక సర్పంచ్ ఎన్నికలు వస్తేనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని విహెచ్ అన్నారు.