– డిప్యూటీ సీఎం పదవి ఆరో వేలువంటిదన్న తులసిరెడ్డి
నారాలోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటే పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పవన్‌ను సీఎంగా చూడాలంటూ కొందరు జనసేన నేతలు వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక ఇదే అంశంపై వైసీసీ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తుండడంతో.. టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ విషయంపై ఎవ్వరూ మాట్లాడవద్దంటూ టీడీపీ నేతలకు హుకుం జారీ చేసింది.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవిపై ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పదవి ఆరో వేలు వంటిదని… దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఎప్పుడో చెప్పారని ఆయన అన్నారు. నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని తులసిరెడ్డి చెప్పారు. వాస్తవానికి ఆ పదవికి ఎలాంటి ప్రొటోకాల్ ఉండదని అన్నారు. డిప్యూటీ సీఎంకు అదనపు అధికారాలు, హక్కులు ఉండవని తెలిపారు. లోకేశ్ పై ప్రేమ ఉంటే, ఆయన సామర్థ్యంపై నమ్మకం ఉంటే లోకేశ్ కు సీఎం పదవి ఇవ్వమని టీడీపీ నేతలు అడగాలని చెప్పారు.