బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గడ్డం తీస్తానంటూ అప్పటి పీసీసీ చీఫ్గాఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం బూనారు. ఆ తర్వాత దీనిపై ఎన్నో కామెంట్లు వచ్చాయి.. కేసీఆర్ కూడా సెటైర్లు వేశాడు. గడ్డం తీయకుంటే నువ్వే గుడ్డెలుగోలే ఉంటావంటూ కూడా ఎద్దేవా చేశారు. అయితే, తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉత్తమ్ మంత్రి అయ్యాడు. తాజాగా ఆయన సతీసమేతంగా తిరుపతి వెళ్లారు. ఉత్తమ్ సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి జన్మదినం సందర్భంగా తిరుమలలో మొక్కులు చెల్లించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి.. మళ్లీ అదే గడ్డంతో కనిపించారు. పద్మావతి మాత్రం తలనీలాలు ఇచ్చి, మొక్కు తీర్చుకుంది. ఇదే సమయంలో ఉత్తమ్ గెడ్డం శపథం మళ్లీ వైరల్ అయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా.. గడ్డం ఎందుకు తీయడం లేదనే ప్రశ్న మొదలైంది. అయితే, ఇంకా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా.. లేదా అనే అనుమానాల్లోనే ఉత్తమ్ ఉన్నాడా.. లేకుంటే సీఎం అయ్యేదాకా గడ్డం తీయను అంటూ శపథం చేశాడా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
