Friday, October 18, 2024

ఇంటివద్దకే ఎల్వీప్రసాద్ వైద్య సేవలు

ప్రముఖ కంటి ఆస్పత్రి ఎల్వీప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఇంటి వద్దకే నేత్ర సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చింది. స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంకు భాగస్వామ్యంతో ఈ సేవలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని ఎల్వీ ప్రసాద్ విజన్‌ సెంటర్ల పరిధిలో ప్రారంభించింది. గురువారం హైదరాబాద్‌ లోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమంలో ఎల్వీపీఈఐ వైస్‌ ఛైర్‌ డాక్టర్‌ రాజీవ్‌రెడ్డి ఈ సేవలను ఆరంభించారు. ప్రస్తుతానికి మూడు రాష్ట్రాల్లో ఉన్న ఎల్వీ ప్రసాద్ విజన్‌ సెంటర్లకు 10-25 కిలోమీటర్ల దూరం పరిధిలో ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తామని తెలిపారు.

ఈ సేవల్లో ప్రధానంగా వృధ్దులు, దివ్యాంగులు, మంచం మీద నుంచి కదల్లేని వారు, చిన్న పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆయా విజన్‌ సెంటర్లకు ఫోన్‌ చేయడం, లేదంటే ఎల్వీపీఈఐ వెబ్‌సైట్‌లో సంప్రదించడం ద్వారా ఈ సేవలు పొందొచ్చు. ఐతే పేదలు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి ఉచితంగానే ఈ సేవలు అందిస్తామని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంటి వద్దకే కంటి వైద్య సేవల్లో భాగంగా రోగి నేత్ర సమస్యల చరిత్ర, టార్చిలైట్‌ పరీక్ష, రిఫ్రాక్షన్‌ పరీక్ష, యాంటీరియర్‌ సెగ్మెంట్‌ పరీక్ష, ఇంట్రాఆక్యులర్‌ ఒత్తిడి పరీక్ష, ఫండస్‌ మూల్యాంకనం, అవసరమైతే అల్ట్రాసౌండ్‌ బి-స్కాన్, ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టోమోగ్రఫీ తదితరాలు, మధుమేహ సంబంధిత రెటీనోపతి, గ్లకోమాకు ఏఐ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ లో వ్యక్తిగత అపాయింట్‌మెంట్‌ కోసం 25 కి.మీ పరిధిలో రూ.1,500, గ్రూపు అపాయింట్‌మెంట్‌ ఒక్కొక్కరికి ఛార్జీలు రూ.1,000 మేర చార్జీలు వసూలు చేస్తారు. ఇంటి వద్దకే వైద్య సేవలతో పాటు వాయిస్‌ లేదా వీడియో కాల్‌ ద్వారా టెలీకన్సల్టేషన్‌ సేవలూ అందించేదుకు సైతం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ఏర్పాట్లు చేసింది. అవసరమైన వారు ఎల్వీపీఈఐ ఆప్టికల్‌ సేవల ద్వారా వైద్యులు సూచించిన కళ్లద్దాలను ఇంటికే తెప్పించుకోవచ్చు. వైద్య పరీక్షల అనంతరం అర్హులైన రోగులకు ఉచితంగా శుక్లాల శస్త్ర చికిత్సలు చేస్తామని తెలిపారు ఎల్వీపీఈఐ వైస్‌ ఛైర్‌ డాక్టర్‌ రాజీవ్‌రెడ్డి. భవిష్యత్తులో మరిన్ని కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మోసం చేయడంలో రేవంత్ రెడ్డి ఘనుడు అన్న మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular