గద్దర్ కాదు.. ఫిల్మ్
తెలుగు సినిమా పుట్టిన రోజున అవార్డ్ ఫంక్షన్
ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 6న వేడుకలు
ఇప్పటికే గద్దర్ అవార్డులను వ్యతిరేకించిన టాలీవుడ్
తాజాగా ప్రత్యేక ఎజెండా ప్రకటించిన ఫిల్మ్ ఛాంబర్
చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం మధ్య విభేదాలు తీరేలా లేవు. ఇప్పటికే కొనవూపిరి మీద సత్సంబంధాలు కొనసాగుతుండగా.. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ లొల్లి మొదటికొచ్చినట్లుగా మారింది. సర్కారుకు వ్యతిరేకంగా ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక అవార్డులను ప్రకటించుకున్నది. తమ అవార్డులు తమకే అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నది. ఈ లెక్కన గద్దర్ అవార్డులను చిత్ర పరిశ్రమ పక్కన పెట్టింది. ఇప్పటికే గద్దర్ అవార్డులపై ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి తొలి వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయం మళ్లీ ఆజ్యం పోసినట్లుగా మారింది.
ఏటా అవార్డులు
ఇక నుంచి ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని ఫిల్మ్ ఛాంబర్గురువారం నిర్ణయించారు. ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు తన ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలనే కట్టుబాటు పెట్టుకున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు ఫిల్మ్ ఛాంబర్ అప్పగించింది. అయితే ఉగాది రోజున ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, సర్కారు అవార్డులకు ముందు తమకు తాము అవార్డుల వేడుక నిర్వహించుకుంటామని ప్రకటించడంతో ప్రభుత్వానికి సవాల్ చేసినట్లుగా మారింది.
ఎందుకింత హడావుడి
నిజానికి, ఫిల్మ్ చాంబర్ ఇప్పటి వరకూ ఎలాంటి అవార్డులు ఇవ్వలేదు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వేడుకా చేయలేదు. ఇటు వివాదాలు సాగుతున్నా కొంత మేరకు అంటీముట్టనట్టుగానే ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఉన్నఫళంగా ఫిల్మ్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా ఈ అవార్డులను ఇస్తామని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీకి నంది అవార్డులు ఇచ్చేవి. వీటిని సినీ పరిశ్రమ నుంచే అప్లికేషన్లు స్వీకరించి.. ఆ వర్గం నుంచే ఎంపిక ప్రక్రియను కూడా చేపట్టింది. కానీ, తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి నంది అవార్డులు ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వంకూడా వాటిని పట్టించుకోలేదు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అవార్డులు ఇవ్వలేదు. సినీ పరిశ్రమకు చెందిన ఎలాంటి ప్రత్యేక వేడుకలు కూడా చేయలేదు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో సింహ అవార్డులు ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ.. ఆచరణలో పెట్టలేదు.
టాలీవుడ్‌పై అందుకే నిర్లక్ష్యం
గతంలో పలుమార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంగానీ, తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకున్నట్లుగా పరిస్థితి లేదు. అంతేకాకుండా టాలీవుడ్లో ఒక వర్గం పెత్తనం చెలాయిస్తుందనే కారణంగా సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు ఎవరూ ముందడుగు వేయలేదు. ఏదో ఒకటీ, రెండుసార్లు సినీ తారలకు ప్రభుత్వం తరపున బ్రాడ్ అంబాసిడర్లుగా అవకాశం ఇచ్చినా.. అదీ ఉండీ లేనట్టే అన్నట్టుగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ దూరం మరింత పెరిగింది. సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నప్పటికీ.. ఆయన సినీ ఇండస్ట్రీతో అంటీముట్టనట్టుగానే ఉంటూ వస్తున్నారు. ఫలితంగా చిత్ర పరిశ్రమపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఏర్పడింది. ఇదే సమయంలో ఒకరిద్దరితో జరిగిన వివాదాల నేపథ్యంలో ఈ దూరం మరింత పెరిగింది. అదే సమయంలో డ్రగ్స్‌పై సినిమా వర్గం సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే కోరినా.. ఎవరూ ముందుకు రాలేదు. ఇలా పలు కారణాలతో సినిమావాళ్లతో సర్కారు సఖ్యత కొనసాగలేదు. అంతేకాకుండా గద్దర్ పేరుతో సినీ అవార్డులు ఇస్తామని సీఎంప్రకటించారు. గద్దర్ జయంతి రోజున ఇస్తామని ప్రకటించారు. కానీ, ఈ అవార్డులపై టాలీవుడ్ స్పందించలేదు. గద్దర్ పేరుతో ఏదో ఓ అవార్డు అంటే సరే కానీ.. పూర్తిగా నంది పేరు తీసేసి గద్దర్ పేరుతో ఇస్తామనేసరికి టాలీవుడ్ ఆసక్తి చూపించలేదు. ఇటీవల కూడా గద్దర జయంతి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉగాది రోజున గద్దర్ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. దీనికి కూడా టాలీవుడ్‌నుంచి రిప్లై రాలేదు. దీంతో సర్కారు నిర్ణయాలను చిత్ర పరిశ్రమ వ్యతిరేకించినట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలోనే గద్దర్ అవార్డులు తమ ప్రాధాన్యం కాదన్నట్లుగా ఫిల్మ్ చాంబర్ కొత్త అవార్డులను ప్రకటించుకుంది. దీంతో ఈ అవార్డుల లొల్లి మళ్లీ ముందుకు వచ్చినట్లైంది.