ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాధ్ రెడ్డితో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్, బ్రహ్మజీ, ప్రేమ్ రక్షిత్ వీడియో బైట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ సివిల్ సర్వెంట్ గోపీనాథ్ రెడ్డి ఐఏఎస్ మాట్లాడుతూ.. ”నేనెక్కడున్నా’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చినందుకు హ్యాపీగా ఉంది. దర్శకుడు మాధవ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇది చిన్న సినిమా కదా, మన సపోర్ట్ ఇస్తే బాగుంటుందని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది చిన్న సినిమా కాదని. ఇది చిన్న అనబడే పెద్ద సినిమా. అందుకుగానూ, దర్శకుడు మాధవ్‌ని, ఆయనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి ఎంతగా కష్టపడి ఉంటారో అని అనిపిస్తుంది. పత్రికా రంగంలో ఉన్న వ్యక్తికి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆ సమస్యలను వారు ఎదుర్కొవడం అవసరమా? అనే ప్రశ్నకు జవాబు ఈ సినిమా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి పత్రికా రంగం. అలాంటి రంగంలోని వ్యక్తికి సమస్య వస్తే? అనే దానికి జవాబు చూపిస్తూ… మరోవైపు స్త్రీ శక్తికి మనం అవకాశం ఇస్తే, ఎలా ఆకాశం అంత ఎత్తు ఎదుగుతుందో? అనే విషయాన్ని కూడా మాధవ్ ఇందులో చూపించారని తెలిసింది. అందుకు మాధవ్‌ని అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా హీరోయిన్ అద్భుతంగా నటించిందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తుంది. వారి కష్టానికి ప్రతి ఫలంగా ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ లాభసాటిగా ఉండాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ తర్వాత మరోసారి ఇలాంటి వేడుక నిర్వహించాలని, మాధవ్ మరిన్ని గొప్ప చిత్రాలను చేయాలని ఆకాంక్షిస్తున్నాన”ని తెలిపారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ… ”ఇందులో నటించిన సషా భారతదేశం మొత్తానికి తెలుసు. 4జీ యాడ్‌తో ఆమె అందరికీ పరిచయమైంది. ఆ యాడ్‌తో మారుమూల పల్లెటూళ్లలో కూడా ఆమె మంచి పాపులరిటీని సొంతం చేసుకున్న సషా ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఒకప్పుడు చంపేసేవారు. ఆడపిల్ల సబల కాదు అబల అనుకునేవారు. కానీ పెంపకం చక్కగా ఉంటే, ఆడపిల్ల ఏ స్థాయికైనా వెళుతుందనే నేపథ్యంలో ఈ కథని సిద్ధం చేశారని తెలిసింది. ట్రైలర్ కూడా చాలా బాగుంది. హీరో మిమో చక్రవర్తి కూడా వాళ్ల నాన్న మిథున్ చక్రవర్తిలా తెలుగులోనే మొదటి సినిమా చేస్తున్నారు. ఆయనలానే ఈయన కూడా సక్సెస్ అవ్వాలని, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బాగుంది. అసలు ఆర్టిస్ట్‌ల పేర్లు చేస్తుంటే భయమేస్తుంది. అలాంటి నటీనటులు ఇందులో ఉన్నారు. అంత పెద్ద స్టార్ నటీనటులను మాధవ్ ఎలా డీల్ చేశాడు? అనేదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి, గోపీనాధ్ రెడ్డి చెప్పినట్లుగా సక్సెస్ మీట్‌కు కూడా మమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నాన”ని అన్నారు.
బీజేపీ మోర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ… ”మహిళా సాధికారత అని అంటుంటాం. అది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారనేది టీజర్, ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. మహిళా ప్రధాన నేపథ్యం ఇటువంటి సినిమా చేసిన టీమ్‌కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదు అనేది ఇందులో చూపించారు. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్‌తో సమాజంలో మార్పు వస్తుందని భావిస్తున్నాను. జర్నలిజంపై ఈ సినిమా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. జర్నలిస్ట్‌లందరూ నిజాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న వికసిత్ భారత్‌లో మొత్తం మహిళలే ఉండబోతున్నారని చాలా గర్వంగా చెప్పగలను. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుతూ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన”ని అన్నారు.
నటి లావణ్య మాట్లాడుతూ… ”ఈ వేడుకకు నన్ను పిలిచినందుకు థ్యాంక్యూ. ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమా చేసేటప్పుడు మా దర్శకుడు మాధవ్ గారి గురించే చెబుతూ ఉండేవారు. ట్రైలర్ చాలా బాగుంది. భారీ తారాగణం ఇందులో ఉంది. కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని తెలిపారు.
‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ దర్శకుడు చందు మాట్లాడుతూ… ”ఈ సినిమా కోసం మాధవ్ గారు ఎంతగా స్ట్రగుల్ చేశారో నేను దగ్గరుండి చూశాను. నేను దర్శకుడి మారడానికి, ఈ స్టేజ్ పై ఇలా ఉండటానికి ఆయనే కారణం. ఆయన పెట్టిన భిక్ష ఇది. ఒక స్టేజ్‌లో ఈ సినిమా ఆగిపోయింది. కరోనాకి ముందు ఓ నిర్మాత వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఆ టైమ్‌లో కెబిఆర్ గారు సపోర్ట్ చేసి ఈ సినిమాను ఇంత వరకు తీసుకువచ్చారు. మాధవ్ గారు ఎంత స్ట్రెస్‌లో ఉన్నా, అది సెట్‌లో చూపించరు. అంత గొప్ప దర్శకుడాయన. ఈ సినిమా అందరికీ మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాన”ని అన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వై గంగాధర్ మాట్లాడుతూ… ”చాలా స్ట్రగుల్స్ తర్వాత, చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదలకు వస్తుంది. ఈ సినిమాలో నేను కూడా చిన్న పాత్ర చేశాను. ఒక మంచి ఇతివృత్తంతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదిరిస్తారని ఆశిస్తూ.. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన”ని అన్నారు.
రైటర్ – డైరెక్టర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ… ”దర్శకుడు మాధవ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. 10 ఏళ్ల క్రితమే మేము కలిసి పనిచేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఈ సినిమాకు దాదాపు 4 సంవత్సరాల జర్నీ ఉందంటే, ఈ సినిమాకు అన్నీ తానై అయి ఉంటాడు. ఈ రోజుల్లో సినిమా చేయడం ఈజీనే కానీ, రిలీజ్ వరకు తీసుకురావడమనేది టఫ్ జాబ్. ప్రస్తుతం ప్రేక్షకులకు ఏం నచ్చితే అదే బ్రహ్మ పదార్థం. వెయ్యి కోట్లు పెట్టి తీసినా, కోటి రూపాయలు పెట్టి తీసినా ప్రేక్షకులకు నచ్చితేనే అది పెద్ద హిట్టు. జర్నలిస్ట్‌లపై ఈ సినిమా ఉందనేది ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. న్యూస్ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్‌లు అంటూ, ఒక రకపు సౌండ్‌తో ఎన్నో వస్తుంటాయి. ఆ న్యూస్‌ల వెనుక ఎంతో మంది జర్నలిస్ట్‌లు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వర్క్ చేస్తుంటారు. డబ్బులకి ఆశపడకుండా, బెదిరింపులకు భయపడకుండా ఎంతో కష్టపడే జర్నలిస్ట్‌లు ఉంటారు. వారందరి కథని ఒక రిఫలెక్షన్ ఈ సినిమా అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. కొంతమంది జర్నలిస్ట్‌లను నేను చూస్తూ ఉంటా.. చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. వారికి సోషల్ కమిట్మెంట్ ఉండబట్టే అలా ఉండగలుగుతున్నారు. జర్నలిజంపై వస్తున్న సినిమాలను అందరం ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన”ని అన్నారు.
నటి మిహీరా మాట్లాడుతూ… ”అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమాలో నటించాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఈ సినిమాలో ఒక మినీంగ్ ఫుల్ పాత్ర చేశాను. మిథున్ చక్రవర్తి గారి అబ్బాయి సినిమాలో నటించినందుకు హ్యాపీ. సషా చాలా మంచి పాత్రలో నటించింది. అద్భుతంగా నటించింది. ముందు ముందు ఆమెకు మంచి పాత్రలు రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ మాధవ్ గారు చాలా టాలెంటెడ్ పర్సన్. చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి. మహిళా సాధికారితపై ఇటువంటి సినిమా చేసిన ఆయనకు ధన్యవాదాలు. ఇందులో నాకో మంచి పాత్రని ఇచ్చినందుకు థ్యాంక్యూ. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాన”ని తెలిపారు.
హీరోయిన్ సాషా చెత్రి మాట్లాడుతూ… ”అందరూ సమయం కేటాయించి ఈ వేడుకకు వచ్చినందుకు థ్యాంక్యూ. డైరెక్టర్ మాధవ్ గారికి ధన్యవాదాలు. చాలా గొప్ప సినిమా ఇది. మహిళలపై ఇలాంటి సినిమా, నేను ప్రధాన పాత్రలో నటించడం అంతా డ్రీమ్‌లా ఉంది. చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. నేను ఈ దేశానికి చెందిన బిడ్డను, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.