- రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కన్నులపండుగగా వేడుకలు
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ: తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రజలందరికీ అందించిన మహాకవి, పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు..గురువారం రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మహాకవి, పద్మ భూషణ్ డా. బోయి భీమన్న 113వ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం అయింది. ప్రముఖ చిత్రకారులు, భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు మల్లికార్జున రావు అందించిన బొమ్మ కావ్య చిత్రపటాన్ని మంత్రి ఆవిష్కరించారు.. అనంతరం బోయి భీమన్న సతీమణి, సుప్రసిద్ధ కవయిత్రి హైమావతిని శాలువాతో సత్కరించారు.. బోయి భీమన్న పురస్కార గ్రహీత- 2024 మొవ్వ వృషాద్రిపతిని శాలువాతో సత్కరించి, రూ. 2 లక్షలు నగదు పురస్కారాన్ని మంత్రి కందుల దుర్గేష్ అందించారు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సాహిత్యాన్ని వేదికగా చేసుకుని కుల నిర్మూలనని చీల్చి చెండాడిన వ్యక్తి కీర్తి శేషులు బోయి భీమన్న అని తెలిపారు..కుల, మత, వర్గ విభేద రహితమైన భారత జాతి ఆవిర్భవించాలనేదే తన ధ్యేయం అంటూ ప్రకటించి తన దశబ్దాల సాహిత్యాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి భీమన్న అని కొనియాడారు. గంగిగోవు పాలు గరిటెడు అయిన చాలు అన్నట్లుగా ఒక చక్కటి సాహిత్య కార్యక్రమానికి భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించడం శుభ పరిణామం అన్నారు.. రాష్ట్రాన్ని కళా సాంస్కృతిక వైభవాన్ని సుసంపన్నం చేసిన లబ్ద ప్రతిష్టులను స్మరించుకోవడం, సజీవంగా ఉన్న వారిని గౌరవించుకోవడం మన కర్తవ్యమని ఆయన అన్నారు.. తెలుగు భాష గొప్పదనాన్ని, ఆంధ్ర సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్న సదుద్దేశంతో చేసే కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలన్నారు..
జాతీయవాదం తో పాటు దళిత వాదాన్ని కూడా సమ్మిళితం చేసిన మహోన్నత వ్యక్తి బోయి భీమన్న అని మంత్రి అన్నారు.. తన సాహిత్యం ప్రజలను రంజింప చేయడమే కాకుండా ఆలోచింపజేస్తుందన్నారు.. సామాజిక చైతన్యంతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తి, కవి బోయి భీమన్న అని మంత్రి అన్నారు.. అంబేద్కరుడా అనే పాట దళిత జాతీయ గీతంగా నిలిచి వాడ వాడ ల్లో వినిపించింది అన్నారు. ఆయన సాధించిన ప్రగతి, సాహితీ పరంగా చూపించిన చొరవ ఈ రాష్ట్రాన్ని కేవలం ఆంధ్ర మహాసభ అనే ప్రాంతం నుంచి దళిత మహాసభ వైపుకు నడిపించిన విధానాన్ని మంత్రి కొనియాడారు…
పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న అని బోయి హైమావతి రాసిన కథనం సజీవంగా నిలిచిందన్నారు.. రాగవాశిష్టం అనే నవల అరుంధతి వశిష్టుల పరిణయ గాథ అని, సున్నిత ప్రేమ భావాన్ని నడిపించడంలో, పెంచండంలో బోయి భీమన్న ప్రత్యేకంగా నిలిచిందన్నారు. అంబేద్కర్ భావజాలానికి సాహిత్య ప్రతిఫలమే బోయి భీమన్న గారి సాహిత్యం అన్నారు.. అంబేద్కర్ భావజాలాన్ని సాహిత్య రూపంలో తీసుకొచ్చిన బోయి భీమన్న ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులని మంత్రి తెలిపారు..
దళిత వర్గాలకే సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యక్రమం నిర్వహించిందన్నారు. తన సాహిత్యం ద్వారా దళిత ఉద్యమ నేతగా భీమన్న ఎదిగారని వివరించారు. దళిత వర్గాలకు సముచిత స్థానం కల్పించాలన్న సదుద్దేశంతో సాహితీ ప్రక్రియను కొనసాగించారన్నారు.. లలితమైన విధానంలో సున్నితత్వ భావాన్ని స్పురింప జేశారన్నారు. బోయి భీమన్న రాసిన పాలేరు అనే నాటకం ఆనాటి సమాజంలోని ప్రజలను ప్రభావితం చేసింది అన్నారు. పలువురు విద్యాధికులు కావడానికి, సమాజంలో ఐఏఎస్లుగా ఎదగడానికి ప్రేరణగా నిలిచిందన్నారు.. ఆంధ్ర మహాసభలను దళిత ఉద్యమం వైపు నడిపించిన కీర్తి బోయి భీమన్న గారికి దక్కుతుందన్నారు.. తన రచనలతో అణగారిన సమాజాన్ని ప్రేరేపించిన సమరసతా సాహిత్య సిద్ధాంతకర్త బోయి భీమన్న అన్నారు.
భీమన్న అవిశ్రాంత సాహితీ సేవలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు, మరెన్నో గౌరవ సత్కారాలు, పదుల సంఖ్యలో అవార్డులు వరించాయన్నారు. కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఆయన ఘన కీర్తికి తక్కువే అన్నారు. పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలుసాహితీ ప్రక్రియల్లో 70కి పైగా రచనలను వెలువరించిన భీమన్న భావం సున్నితం! భాష సుందరం! అన్నారు.. సాహిత్యంలో భీమన్న సృష్టించిన ఒరవడి అద్వితీయం, అజరామరం అని మంత్రి కొనియాడారు.. ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం ఒక్కటే“భారతజాతి ఏకత్వం”అని తెలిపారు. కార్యక్రమంలో బోయి భీమన్న సతీమణి బోయి హైమావతి, బోయ భీమన్న మేనకోడలు మధుగీత, బోయి భీమన్న పురస్కార గ్రహీత -2024 సుప్రసిద్ధ సాహితీ కారులు, నాటకరంగ ప్రముఖులు మొవ్వ వృషాద్రిపతి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏ. శ్రీనివాస్, సహాయ సంచాలకులు పెంచలయ్య, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.