Thursday, January 30, 2025

మహా కుంభమేళాలో ఘోర విషాదం 20 మంది మృతి?.. 100 మందికి పైగా గాయాలు

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో బుధవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలిరాగా.. విపరీతమైన రద్దీ నెలకొని సెక్టార్ 2 వద్ద బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలంలో ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుండగా.. మరణాల సంఖ్యపై యూపీ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తొక్కిసలాట నేపథ్యంలో అమృతస్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు 13 అఖాడాలు ప్రకటించారు.
అటు, ఘటనా స్థలానికి 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు 3 గంటల పాటు క్షతగాత్రుల తరలింపు ప్రక్రియ సాగింది. ప్రయాగ్‌రాజ్‌లో 8 నుంచి 10 కోట్ల మంది ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం వరకూ ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. భక్తులు భారీగా పోటెత్తడంతో అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. గంటల వ్యవధిలోనే మూడుసార్లు ఆయనతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీశారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రస్తుతం, ప్రయాగరాజ్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ‘త్రివేణి సంగమం ముక్కు భాగానికి చేరుకోవాలన్న ఉద్దేశంతో జనం పోటెత్తారు. దీంతో తీవ్ర ఒత్తిడి ఉంటోంది. మౌనీ అమావాస్యం సందర్భంగా జనం భారీగా వచ్చారు. అఖాడాలు వెళ్లే మార్గం వద్ద ఉన్న బారికేడ్లను నెట్టివేశారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. గాయపడ్డ వారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించండి. ఆదేశాలు, సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించండి. ఎలాంటి వదంతులను నమ్మొద్దు.’ అని సీఎం స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com