- మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు షెడ్యూల్
- మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ .. 23న ఫలితాలు
- అక్టోబర్22న నోటిఫికేషన్
- జార్ఘండ్లో రెండు దశల్లో పోలింగ్
మహారాష్ట్ర, జార్ఘండ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పట్లో బీజేపీ, శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. శివసేన 56 సీట్లతో రెండో స్థానంలో ఉంది. బీజేపీ-శివసేన కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పోటీ చేశాయి. ఆ సమయంలో ఎన్సీపీ 54 స్థానాలతో మూడో స్థానంలో, కాంగ్రెస్ 44 మంది ఎమ్మెల్యేలతో నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్దవ్ ధాకరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లలో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో అనేక రాజకీయ భూకంపాలు సంభవించాయి. మొదట శివసేనలో అంతర్గత తిరుగుబాటు వచ్చింది. 2019లో ఉద్ధవ్ ఠాక్రే భిన్నమైన వైఖరిని అవలంబించి కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే రెండున్నరేళ్ల తర్వాత ఏక్ నాథ్ షిండే ఎంవీపీని వీడి 40 మంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి తిరిగి బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో మహాకూటమిలో ఆయనను ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ తర్వాత అజిత్ పవార్ కూడా 2023లో మహాకూటమిలో చేరారు. ఏక్ నాథ్ షిండే పార్టీని పూర్తిగా చీల్చి బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు. ఈ కారణంగా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత ఎన్సీపీలో కూడా చీలిక వచ్చింది. అసలు పార్టీలను చీలిక వర్గాలు దక్కించుకున్నాయి. శివసేన పార్టీ గుర్తు ఇప్పుడు ఏక్ నాథ్ షిండే చేతుల్లో ఉంది.
అలాగే ఎన్సీపీ గుర్తు అజిత్ పవార్ వద్ద ఉంది. ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ ఇద్దరూ వేర్వేరుగా పార్టీలను పెట్టుకోవాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ వీరు మంచి ఫలితాలు సాధించారు.మహారాష్ట్రలో ఇప్పుడు రెండు కూటముల మధ్య పోరాటం సాగనుంది. బీజేపీ, శివసేన, ఎన్సీపీలు ఓ కూటమిగా.. కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవర్, శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ మహా వికాస్ ఆఘాడిగా పోటీ చేయబోతున్నాయి. ఈ రెండు కూటముల పోటీ రసవత్తరంగా ఉండనుంది. కాంగ్రెస్ కూటమితో జత కలిసేందుకు మజ్లిస్ కూడా ఆసక్తిగా ఉంది. గత ఎన్నికల్లో మజ్లిస్ మంచి ప్రభావాన్ని చూపించింది.
జార్ఘండ్ లో రెండు దశలు
హేమంత్ సోరెన్ అరెస్టు దేశం మొత్తం హాట్ టాపిక్ అయిన జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొచ్చాయి. జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశలో అక్టోబర్ 18వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. రెండో విడతలో 22వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. మొదటి దశ పోలింగ్ నవంబర్ 13వ తేదీన , రెండో దశ పోలింగ్ నవంబర్ ఇరవయ్యో తేదీన జరుగుతుంది. 23వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇండీ కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు, ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.
హేమంత్ సోరెన్ ను మధ్యలో ఈడీ అరెస్టు చేయడంతో ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ నియమితులయ్యారు. అయితే హేమంత్ సోరెన్ మళ్లీ బెయిల్ మీద రావడంతో ఆయనకు రాజీనామా చేయక తప్పలేదు. తర్వాత ఆయన బీజేపీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు హేమంత్ సోరెన్ నేతృత్వంలో జేఎంఎం, కాంగ్రెస్, వామపక్షాల కూటమి మరోసారి అధికారంకోసం ఎన్నికల బరిలో నిలుస్తోంది. హేమంత్ సోరెన్ ను అన్యాయంగా అరెస్టు చేశారని ప్రజుల సానభూతి చూపిస్తారని మరోసారి విజయం సాధిస్తామని కాంగ్రెస్ కూటమి నమ్మకంగా ఉంది. జార్ఖండ్ లో 2014లో బీజేపీ విజయం సాధించింది. రఘుబర్ దాస్ ముఖ్యమంత్రిగా వ్యహరించారు. అప్పట్లో బీజేపీకి 49 సీట్లు వచ్చాయి. తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. జార్ఖండ్‌లో గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ఈసీ తేదీలను ప్రకటించడంతో కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. భద్రతాపరంగా జార్ఖండ్ ను సున్నితమైన ప్రాంతంగా గుర్తిస్తారు. మావోయిస్టుల ప్రాబల్యం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.