సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు
ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
•హాస్పిటల్‌కి తరలించి చికిత్స
•సీఎం రేవంత్ దిగ్భ్రాంతి…
•హుటాహుటిన మంత్రి ఉత్తమ్ సందర్శన
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమ లపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయిన ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయ పడ్డారు. టన్నెల్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాజెక్టు పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎడమవైపు సొరంగ పనులు జరుగుతుండగా, 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది.
ఇందులో భాగంగా నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. టన్నెల్ పైభాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది. అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరిని స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు.
ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఆ పనుల్లో మొదటి షిప్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. ఆకస్మాతుగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగి పడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. వారిలో 42 మంది బయటకి రాగా.. 8 మంది కార్మికులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలి వద్ద నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ దిగ్భ్రాంతి
టన్నెల్‌లో పైకప్పు కూలి కార్మికులు గాయడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఉత్తమ్ వెంట నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, అధికారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. లోపల చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకురావాలని.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే, ఈ టన్నెల్‌లో నాలుగు రోజుల క్రితమే ఎడమ వైపు పనులు ప్రారంభమయ్యాయి. అయితే, ఎంతో త్వరగా ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. టన్నల్ బోర్ మెషిన్‌తో డ్రిల్లింగ్ జరుగుతుండగా, కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన క్షణాల్లో టన్నెల్ లోపల పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దం రావడంతో సమీపంలోని కార్మికులు అప్రమత్తమై లోపలికి పరుగెత్తారు. అప్పటికే పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రభుత్వం టన్నెల్ నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఇంజినీర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఏడాదిలోపు పనులు ముగియాలన్న లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు.
అయితే, ఇలాంటి తక్షణ ప్రాజెక్ట్‌లలో పనుల నాణ్యతను విస్మరించడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఇరిగేషన్ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై వారు సమగ్ర విచారణ చేపట్టారు. పనుల్లో ఎక్కడ తప్పుదొర్లిందో అంచనా వేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రమాదం తర్వాత టన్నెల్ వద్ద పనిచేస్తున్న కార్మికుల్లో భయం నెలకొంది. ఈ ఘటనపై ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారుల నుండి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఈ ప్రమాదానికి నిజమైన కారణం ఏంటనే దానిపై త్వరలో స్పష్టత రానుంది.