Monday, May 12, 2025

ఆదాయంలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా

  • ఆదాయంలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా
  • ఇసుక కొరత లేకుండా చర్యలు చేపడుతున్నా…
  • దొంగ వే బిల్లులుతో ఇసుక సరఫరా చేస్తే కఠినచర్యలు
  • ప్రతి ఇసుక లారీ టిఎస్‌ఎండిసిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే…
  • ఆయా లారీలకు జిపిఆర్ ట్రాకింగ్ సిస్టంను అమర్చుకోవాలి…
  • గనులు, భూగర్భ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, టిఎస్‌ఎండిసి ఎండి,
బెన్హర్ మహేష్ దత్ ఎక్కా

టిఎస్‌ఎండిసి (తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ను ఆదాయంలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా. మరిన్ని ఇసుకరీచ్‌లను గుర్తించి, ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా. దొంగ వే బిల్లులుతో ఇసుక సరఫరా చేసే లారీల యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు రానున్న రోజుల్లో ప్రతిలారీకి జిపిఆర్‌ఎస్ ట్రాకింగ్ సమకూర్చి దొంగ వే బిల్లులను అరికట్టడానికి కృషి చేస్తున్నా. దీంతోపాటు ఇసుక కొరత లేకుండా చర్యలు చేపడుతున్నా. ఆన్‌లైన్‌లో రోజుకు లక్ష క్యూబిక్ మీటర్‌ల ఇసుకను అందుబాటులో పెట్టి ఇసుక కొరత రాకుండా చర్యలు చేపడుతున్నామంటూ గనులు, భూగర్భ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, టిఎస్‌ఎండిసి ఎండి, బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, ఐఏఎస్ఇంటర్వూలో పేర్కొన్నారు. ఆయన టిఎస్‌ఎండిసికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఆయన గనులు, భూగర్భ, పరిశ్రమల శాఖలో తనమార్క్ చూపిస్తుండగా ప్రస్తుతం టిఎస్‌ఎండిసి సంస్థకు మరింత ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నానని తెలిపారు.

రోజుకు లక్ష మెట్రిక్ టన్నుల ఇసుక….

టిఎస్‌ఎండిసి మేనేజింగ్ డైరెక్టర్‌గా (ఎండిగా) చార్జీ తీసుకోగానే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై దృష్టి సారించాను. అప్పటి నుంచి ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా. అందులో భాగంగా గతంలో రోజుకు 50 నుంచి 70 వేల మెట్రిక్‌టన్నుల ఇసుక మాత్రమే ఆన్‌లైన్‌లో లభించేది. దీనివల్ల ఇసుక డిడిలకు భారీగా డిమాండ్ ఏర్పడడం, బ్లాక్‌లో ఇసుకను అమ్ముతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని గుర్తించాం. అందుకే రోజువారీ ఆన్‌లైన్ ఇసుక విక్రయాలను పెంచుకున్నాం. రోజుకు లక్ష మెట్రిక్‌టన్నులకు తగ్గకుండా ఇసుకను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాం. గతంలో ఇసుక డిడిలు ప్రతిరోజు గంటపాటు మాత్రమే విక్రయించేవారు. ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో ఇసుక డిడిలను విక్రయిస్తుండడంతో బిల్డర్‌లు, నిర్మాణరంగం వారికి ఇసుక సులభంగా అందుతోంది.

సిబ్బంది అక్రమాలకు పాల్పడకుండా నిఘా….

రానున్న రోజుల్లో మరిన్ని ఇసుకరీచ్‌లను గుర్తించి వాటికి త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఈ ఇసుకరీచ్‌ల టెండర్‌లలోనూ అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. దీనికి నూతనంగా విధి, విధానాలను కూడా రూపొందించే పనిలో ఉన్నాం. ఇసుకరీచ్‌ల వద్ద పనిచేసే పిఓ, డిపిఓ, ఎస్‌ఆర్‌ఓ, సెక్యూర్టీ గార్డులు విధులు సక్రమంగా నిర్వహించేలా, అక్రమాలకు పాల్పడకుండా నిరంతరం వారిపై నిఘా ఉంచాలని నిర్ణయించాం.

ప్రతి ఇసుక లారీకి రిజిస్ట్రేషన్…దానికి జిపిఆర్‌ఎస్ ట్రాకింగ్ సిస్టం

దొంగ వే బిల్లులతో ఇసుకను సరఫరా చేసే లారీలను రవాణా, పోలీసు శాఖతో కలిసి వాటిని సీజ్ చేయడంతో పాటు అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. అందులో భాగంగా ఇక నుంచి ఇసుకను సరఫరా చేసే లారీలను టిఎస్‌ఎండిసిలో రిజిస్ట్రేషన్ కావాలని ఆదేశాలు జారీ చేశాం. అలా రిజిస్ట్రేషన్ అయిన లారీల నుంచి రిజిస్ట్రేషన్ రూపంలో రూ.2 వేలను ఫీజుగా వసూలు చేస్తున్నాం. ఇప్పటికే సుమారుగా 50 వేల పైచిలుకు లారీలు టిఎస్‌ఎండిసిలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఆ లారీలకు జిపిఆర్‌ఎస్ ట్రాకింగ్ సిస్టంను కూడా అమర్చుకునేలా ఆయా లారీల యజమానులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ట్రాకింగ్ సిస్టంను అమర్చుకోక పోతే ఆ లారీలు ఇసుకను తరలించరాదన్న నిబంధనలను కఠినతరం చేశాం.

పర్యావరణ అనుమతులు త్వరగా వచ్చేలా…..

దీంతోపాటు నగర శివార్లలో ఇసుక తరలిస్తున్న లారీలను ఎప్పటికప్పుడు చెక్ చేసేలా ఆదేశాలు జారీ చేశాం. ముఖ్యంగా కొత్త రీచ్‌ల అనుమతుల విషయంలో పర్యావరణ అనుమతులు ఆలస్యం అవుతున్నాయి. అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన వాటికి అనుమతులు వచ్చేలా అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాం.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com