బిఆర్‌ఎస్ నేతలు పదేళ్ల పాలనలో తప్పులు చేసినందుకే ఆరు నెలలకు ఒకసారి మతిపోయేలా ప్రజలు తీర్పు ఇస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సాధారణ ఎన్నికల్లో, ఆ తర్వాత ఆరు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వారికి డిపాజిట్ రాకుండా చేశారని అన్నారు. బిఆర్‌ఎస్ నేతలది భూస్వామ్య మనస్తత్వమని తనపై వారు ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా రైతులకు 21 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని చెప్పగా.. భూమిలేని నిరుపేద కూలీలకు ఏమీ ఇవ్వరా అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ఏడాదికి రూ.12,000 ఇస్తామని ప్రకటించానని,. పేదలకు ఇవ్వడం తప్పా, వారికి ఇవ్వొద్దని బిఆర్‌ఎస్ నేతలు కోరుకుంటున్నారా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నేతలు వారి కాలంలో వారికి అనుకూలంగా రూల్స్ బుక్ రూపొందించారు. ప్లకార్డులు తీసుకురావద్దని, నినాదాలు చేయొద్దని రాశారు. ఇప్పుడు వాటిని వారే ఉల్లంఘిస్తున్నారని తెలిపారు.
వారి పాలనలో స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు బీఏసీ సమావేశంలో ప్రతిపక్షాలు లేవనెత్తాలనుకున్న అంశాలు, అధికారపక్షం అనుకున్న అంశాలు అన్నీ కలిపి స్పీకర్‌కు ఇచ్చి వారి నిర్ణయం తీసుకుంటారని చెప్పేవారు. అదే పద్ధతిని మేము కూడా పాటించాలని కోరుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానంలో గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు బీఏసీ సమావేశంలో ఆ పద్ధతిని పక్కన పడేసి బిఎసి సమావేశంలో కాగితాలు పారేసి వెళ్లిపోతున్నారు ఇదేం సంప్రదాయమని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక లక్ష కోట్లు అప్పు చేసిందని విపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. తాము 52 వేల కోట్లు మాత్రమే అప్పు చేశామని, 66,000 కోట్లు వడ్డీ అసలు కలిపి ఈ 11 నెలల్లో బకాయిలు చెల్లించామని అన్నారు. బిఆర్‌ఎస్ నేతలు 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెడితే మేము ఇప్పటికే 14 వేల కోట్లు వారు పెట్టిన బకాయిలు క్లియర్ చేశామని తెలిపారు. వారి పాలనలో పౌరసరఫరాల శాఖలో 18 వేల కోట్లు పెట్టిపోయారు, మిల్లర్స్ నుంచి బ్యాంక్ గ్యారెంటీ కూడా తీసుకోలేదని అన్నారు. మా మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ బకాయి అన్నిటిని క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. మేము రైతుల నుంచి ధాన్యాలు కొనుగోలు చేసిన మూడు రోజులకే బిల్లులు చెల్లిస్తున్నాం.
మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా ఇచ్చారా? సన్నాలకు కింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.. ఈ నిర్ణయం ద్వారా ఎకరాకు 15,000 అదనంగా వొచ్చిందని మా ఊరి రైతు చిట్టిబాబు సెల్ ఫోన్ కు మెసేజ్ చేశారని వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్. 2004లో మా ప్రభుత్వం ప్రారంభించి ఎప్పటికప్పుడు డిస్కములకు బకాయిలు చెల్లించేది. కానీ బిఆర్‌ఎస్ నేతలు రూ.18 వేల కోట్ల బకాయిలు డిస్కములకు పెట్టారని, మేము ఎప్పటికప్పుడు డిస్కములకు బకాయిలు చెల్లిస్తున్నాం. ఇప్పటికే 11 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. పరిశ్రమల శాఖలో వారు 3,000 కోట్ల బకాయిలు పెట్టి పోయారని అన్నారు. బిఆర్‌ఎస్ పాలకులు కాంట్రాక్టర్లకు ప్రతి సంవత్సరం పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించేవారు.. కానీ పేద బిడ్డలు చదువుకునే వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు మాత్రం ఒక్క రూపాయి పెంచలేదు.. ఫలితంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లు ఆహారం అందించలేక నాణ్యతలేని భోజనం ఇవ్వడంతో పిల్లలు ఇప్పుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ దుస్థితిని గమనించి మేము ఒకేసారి 40 శాతం మెస్ చార్జీలు, 200 శాతానికి పైగా కాస్మోటిక్స్ చార్జీలు పెంచామని తెలిపారు.
హరీష్ రావుకు ఎప్పటికీ నిజం చెప్పే అలవాటు లేదు.. ఆయనకు రాజకీయం చేసే అలవాటు ఉందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఆర్బిఎం పరిధిని దాటి మేము ఎప్పుడూ అప్పు చేయలేదు.. వీలైతే తగ్గించుకుంటూ పోవాలని జాగ్రత్తగా తీసుకుంటున్నామన్నారు. పదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ఒక సంవత్సరంలో చక్కబెట్టలేం.. అందుకే కొంత అప్పు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఔటర్ రింగ్ రోడ్డు ను 30 సంవత్సరాల కాలానికి బిఆర్‌ఎస్ నేతలు అమ్ముకున్నారు… వాళ్లు లీజుకి ఇచ్చి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. వారి తరహాలోనే మేము కూడా కమర్షియల్ ట్యాక్స్.. మరి కొన్ని వాటిని 30 సంవత్సరాలకు ఇప్పుడే అదానీ, అంబానీ కి ఇప్పుడే అమ్ముకుంటే వొచ్చే ప్రభుత్వాలు ఎలా బతుకుతాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.