రాష్ట్రంలో తుగ్లక్ మాదిరిగా పాలన
సాధ్యంకాని హామీలిచి అధికారంలోకి వొచ్చారు.
ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు..
మోదీని విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదు..
మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస సోయి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏనాడు ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు పరిష్కారం చేసిన అనుభవం ఆయనకు లేదని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. సోషల్ మీడియా, అబద్ధపు ప్రచారాలు, మీడియాను మేనేజ్ చేసి డబ్బులతో నువ్వు పైకి వొస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తో కలిసి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో.. ఇన్ని పథకాలకు నిధులు ఎక్కడ నుంచి తీసుకొస్తారని అడిగాను. కానీ దానికి సమాధానం చెప్పలేదు. కెసిఆర్ 2018 ఎన్నికల హామీలను తీర్చలేకపోయారు. రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మీరు ఎలా ఇవ్వగలుగుతారనిని అడిగాం. అప్పుడు ఆలోచన చేయలేదు.. కానీ వారికి ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతినెలా రూ.6600 కోట్లు అసలు, వడ్డీకి సరిపోతుంది. అంటే సంవత్సరానికి 80 వేల కోట్లు, అసలు వడ్డీ కడుతున్నాం. ఆనాడు ఈ తెలివి లేదా ఈ ఆలోచన లేదా ? గ్రామపంచాయతీలో పనిచేసే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు రాక ఉరి వేసుకొని చచ్చిపోతున్నారు. ప్రభుత్వ పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. బిల్లులు రావని భయపడుతున్నారు. గవర్నమెంట్ టెండర్లు తీసుకోవడం అంటే సూసైడ్ చేసుకోవడమే అనే పరిస్థితికి వొచ్చింది. జిహెచ్ఎంసి పరిధిలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేక పేపర్లను షూరిటీ పెట్టి బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకోండి అని.. చిట్టీలు కుదవబెట్టే దౌర్భాగ్యపు పరిస్థితి ఉందని విమర్శించారు.
కేంద్రం నిధులు ఇవ్వకుంటే రాష్ట్రప్రభత్వం అధోగతి
కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి బతుకు లేదని ఈటల రాజేందర్ అన్నారు. గ్రామాలలో పెరిగే చెట్లు, పారేమురుగు నీరు కాలువలు, వెలుగుతున్న లైట్లు, నడుస్తున్న రోడ్లు, స్మశాన వాటికలు, గ్రామ సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ డబ్బుతో నిర్మిస్తున్నవే ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడలేదు. దమ్ముంటే ఈ అంశాల మీద చర్చ పెడదాం. చివరికి గ్రామపంచాయతీలో పనిచేసే సిబ్బందికి కూడా 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతోనే జీతాలు ఇస్తున్నారు. ఇది సిగ్గుచేటు. అసలు నీకు మోదీతో పోల్చుకోవడం సాధ్యం అవుతుందా ? గతంలో ఉన్న పెద్ద పెద్ద ప్రధాన మంత్రులే ఆపని చేయలేకపోతున్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదు అనేది మోదీ ఫిలాసఫీ. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది అనేది చూడకుండా నిధులు విడుదల చేస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మారం కోసం 25 ఏళ్లు కొట్లాడాం.. మోదీ వొచ్చిన తర్వాతనే ఆ ఫ్యాక్టరీ తెరుచుకుంది. తెలంగాణ రైతులు ఇబ్బంది పడవద్దని రూ.6300 కోట్లు విడుదల చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఒక స్వప్నం. దానిని ఇచ్చింది కూడా మోదీనే రైల్వే లైన్లు నాలుగు లైన్లు చేస్తున్నారు.. దానికోసం కనీసం భూసేకరణ చేయలేని ప్రభుత్వం మీది. పదేపదే దిల్లీకి పోయి దరఖాస్తులు ఇచ్చి వొస్తున్నావు కానీ నీ చేతిలో ఉన్న పని చేసే దమ్ము నీకు లేదు.
కిషన్ రెడ్డి తేవాలి అని మాట్లాడుతున్నారు నీకు జ్ఞానం ఉందా.? బడ్జెట్లో జిల్లాల వారీగా నిధులు పెడతామా.. ఏ జిల్లాకు ఎంత కేటాయించావో నీ బడ్జెట్లో చూపిస్తావా. కేంద్రం కూడా రాష్ట్రాల వారిగా బడ్జెట్ పెట్టదు. పథకాల వారీగా నిధులు కేటాయింపులు ఉంటాయి. నిరుద్యోగ సమస్య గురించి కేవలం మాట్లాడడం కాదు.. 2024- 25 బడ్జెట్లో బాజప్త నాలుగు లక్షల కోట్లు రూపాయలు పెట్టి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ. గొర్ల స్కీంలో – 500 గొర్లకు కోటి రూపాయలు ఇస్తున్నారు. ఇందులో 50 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రూ.40 లక్షల బ్యాంకు రుణం ఇస్తుంది. పది లక్షల రూపాయలు బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ కట్టాలి. 2021 నుంచి ఇప్పటివరకు 203 మందికి స్కీం వొస్తే రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు కూడా విడుదల చేయలేదు. దీనిమీద సమీక్ష చేయరు. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ లో.. రైతులకు ఎక్కువ డబ్బులు చెల్లించడానికి అవసరమైన సమీక్షను చేయాల్సిన బాధ్యత సీఎం మీద లేదా ? ఫోర్త్ సిటీ పెట్టే దగ్గర ఐదు కోట్లకు ఎకరం ఉంటే 20 లక్షలు ఇస్తామని దబాయిస్తున్నారు. మళ్లీ కలెక్టర్లందరూ నిద్రపోతున్నారని మాట్లాడుతున్నావు.. రేవంత్ పాలన తుగ్లక్ పాలన లెక్క కనిపిస్తుంది. సిఎస్ఎస్ కింద, ఎన్ ఆర్ హెచ్ఎం కింద ఎన్ని డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, రాష్ట్ర కంట్రిబ్యూషన్ చెల్లించలేక ఎన్ని బాకీలు ఉన్నాయి..అనేది మోదికి తెలియదు అనుకున్నావా. ఎంఎంటీఎస్ నిర్మాణంలో 1350 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టాలి.. కానీ అవి కట్టకపోవడం వల్ల రైల్వే డిపార్ట్మెంట్ మొత్తం చెల్లించి పనులు చేస్తుంది.
దీని మీద చర్చకు వచ్చే దమ్ము నీకుందా. 420 కోట్లు పెట్టి చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తే దానికి మౌలిక వసతులు కనిపించడానికి 80 కోట్ల రూపాయల ఖర్చవుతుంది.. దానికి డబ్బులు విడుదల చేయడం లేదు కట్టిన రైల్వే స్టేషన్ ఉత్సవ విగ్రహం లెక్క తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లకు సున్నాలు వేశారు తప్ప డబ్బులు విడుదల చేయలేదు. ఇప్పుడు ఒకసారి పోయి చూడు అభివృద్ధి ఎలా జరుగుతుందో. అందుకే రేవంత్ రెడ్డి వెకిలి మాటలు బంద్ చేసి పని మీద దృష్టి పెట్టు. నిజాయితీగా నీకు కావలసిన నిధులు గురించి దరఖాస్తు పెట్టు అంతేకానీ చిట్ చాట్ పెట్టుడు, లీకులు ఇచ్చుడు కాదు. కేంద్రాన్ని, నరేంద్ర మోదీని బదనాం చేయడం.. కిషన్ రెడ్డిని నిందించడం అంటే సూర్యుని మీద ఉమ్మివేసినట్లే. కెసిఆర్ కూడా ఇలానే చేశారు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోదీ వొస్తారని పోస్టర్లు వేశారు, హోర్డింగులు పెట్టించారు.. మోదీకి కూతురు కొడుకు అల్లుడు లేడు 150 కోట్ల ప్రజలే ఆయన కుటుంబంగా భావించి.. దేశం అభివృద్ధి చెందితే సంతోషపడటమే నా జీవితాశయం అంటున్నారు. నువ్వు నిన్న మొన్న కొత్తగా వొచ్చి మోదీని విమర్శిస్తున్నావు.. ఆయన విమర్శిస్తే నీ ప్రతిష్ట పెరుగుతుంది అనుకుంటున్నావా ? తూ.. అంటారు. రాజకీయంగా ఖతం అయిపోతావు. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వారిగా గొప్ప తెలంగాణ నిర్మాణం అవుతుందని భావించిన వారిగా ఈ పరిస్థితి చూస్తే బాధ కలుగుతుందని ఈటల రాజేందర్ అన్నారు. తప్పకుండా కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని, తెలంగాణ బాగు చేసుకోవడానికి ప్రజలే ముందుకు వొచ్చి కర్రు కాల్చి వాత పెడతారని ఆయన హెచ్చరించారు. .