Monday, November 18, 2024

మ‌ల్లారెడ్డి 47 ఎక‌రాలు క‌బ్జా.. రాత్రికి రాత్రే రిజిస్ట్రేష‌న్‌?

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి పై చీటింగ్ కేను నమోదైంది. గిరిజనులకు వారసత్వంగా సంక్రమించిన భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై మల్లారెడ్డి సహా ఎనిమిదిమందిపై శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీమంత్రి మల్లారెడ్డి, ఆయన సమీప బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనే హరి మోహన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహా, రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 420 కేసులు నమోదయ్యాయి. స్థానిక సిఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గంటల ఎస్టీ (లంబాడీ) లవారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి వారి బినామీ అనుచరులు 8 మంది అక్రమంగా కబ్జా చేసి కుట్ర పూరితంగా కాజేశారని, బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కేసు నమోదు చేశామని చెప్పారు. చామకూర మల్లారెడ్డి ఆయన అనుచరులపై కేసు నమోదు చేశామని తెలిపారు.

రాత్రి 11 గంటలకు రిజిస్ట్రేషన్

మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల18 గుంటల భూమి తమ పెద్దల నుంచి వారసత్వంగా తమకు వచ్చిందని బాధితుడు కేతావత్ భిక్షపతి నాయక్ చెప్పారు. ఈ భూమి తనతోపాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులపైనా ఉన్నదని చెప్పారు. దీనిపై కన్నేసిన చామకూర మల్లారెడ్డి ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులైన శ్రీనివాసరెడ్డి, హరిమోహన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహరామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిని మా ఇంటికి పంపి మాయమాటలతో నమ్మించి కుట్ర పూరితంగా రూ. 250 కోట్ల విలువ చేసే భూమిని పీటీ సరెండర్ చేయించారని చెప్పారు. తమ ఏడుగురికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ఇచ్చి రాత్రి 11 గంటల సమయంలో శామీర్ పేట తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. మంత్రికి అండగా ఉండి తమతో రాత్రి వేళ భూమి రిజిస్ట్రేషన్ చేయించిన తహసీల్తార్ వాణిపైనా కేసులు నమోదు చేయాలని భిక్షపతి నాయక్ డిమాండ్ చేశారు. తమకు తెలియకుండానే 250 కోట్ల విలువ చేసే 47 ఎకరాల 18 గుంటల మా భూమిని అక్రమంగా అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేసిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అతని పార్టీ అనుచరులు 9 మందిపై సమగ్ర విచారణ చేపట్టాలని, తమ భూమిని తమకు ఇప్పంచాలని విజ్ఞప్తి చేశారు.

నేను ఎలాంటి భూమి కొనలేదు – ఎమ్మెల్యే మల్లారెడ్డి

తాను ఎలాంటి భూమిని కొనుగోలు చేయలేదని, తనపై భూ కబ్జా అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. తాను కనుక భూమిని కొనుగోలు చేసి ఉంటే ఆ భూమికి సంబంధించిన పత్రాలు తన పేరు మీద ఉండాలి కదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు కావాలనే తనపై నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని విషయాలను గురువారం నాడు మీడియా సమావేశం పెట్టి వెల్లడిస్తాని ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular