రామ్‌చరణ్ నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆశించిన స్థాయిలో ఆ చిత్రం విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏఆర్. రెహమాన్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.
ఇప్పటి వరకు దాదాపుగా 25 రోజులు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వీలున్నంత త్వరగా పూర్తిచేసి దసరాకు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఇందుకోసం దర్శకుడు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ రూటెడ్ కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ మల్లయోధుడుగా కనిపిస్తారని తెలిసింది. మనందరికి తెలిసిన తెలుగు గర్వం, గొప్ప మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడుకు ఈ సినిమా కథకు సంబంధం ఉందని సమాచారం.
ఈ చిత్రంలో రామ్‌చరణ్ కూడా కోడి రామ్మూర్తి నాయుడు ప్రేరణతో, ఆయన పుట్టిన ఊరు శ్రీకాకుళంలోని వీరఘట్టంలోనే పుట్టి ఆయన అడుగుజాడల్లోనే మల్లయోధుడుగా శిక్షణ పొంది, కుస్తీల పోటీలో భారతదేశం తరపున పాల్గొంటాడని తెలిసింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత ఫైట్‌మాస్టర్‌తో రూపొందిస్తున్నారట. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి దాదాపుగా ఇదే టైటిల్‌ను ఖరారు చేస్తారని అంటున్నారు.