Friday, January 10, 2025

మళ్లీ నీ మార్క్‌ మిస్సయ్యావు శంకరా?

ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమానే “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో విడుదల అయ్యింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో ఓసారి చేసేద్దామా..

జెంటిల్ మాన్, ఒకే ఒక్కడు, ప్రేమికుడు, భారతీయుడు, అపరిచితుడు ఇలా ఒక్కో చిత్రం ఒక్కో వజ్రంలా మెరిపించిన దర్శకుడు శంకర్‌.. అలాంటి మేటి దర్శకుడి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే.. అది ట్రోలింగ్ కంటెంట్ అనే పరిస్థితిని కల్సించాడు ఇటీవల. హిట్ చిత్రాల దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన శంకర్‌కి ఈ మధ్య కాలంలో హిట్టే లేదు. ఇలాంటి తరుణంలో దిల్ రాజు నిర్మాణంలో రూ.500 కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్ హీరోగా సినిమా అంటే చాలామందికి డౌటానుమానాలు వచ్చాయి. పోయి పోయి శంకర్‌తో సినిమా ఏంటి? ఔట్ డేటెడ్ డైరెక్టర్ అనే విమర్శలకు ‘గేమ్ ఛేంజర్’ తో ఏం చెప్పాడు.. ఇటీవల వరుసగా చేస్తున్న తప్పులను సరిదిద్దుకున్నాడా.. అనేదే ఇప్పుడు తేల్చాల్సిన ప్రశ్న.

కథనం ఏమిటంటే..
ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్‌కి అవినీతి పరుడైన మంత్రికి మధ్య జరిగే పోరే ‘గేమ్ ఛేంజర్’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్)తో గేమ్ ఛేంజర్ కథ మొదలౌతుంది. అడ్డదారిలో సీఎం అయ్యి.. అవినీతికి అడ్రస్‌గా మారిన సత్యమూర్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. తన పదవీకాలం చివరి ఏడాదిలో రాష్ట్రంలో ఎలాంటి అవినీతి ఉండకూడదని నిశ్చియించుకుంటాడు. అయితే అతని మంత్రివర్గంలో ఉన్న కొడుకులు మోపిదేవి (ఎస్.జే సూర్య), రామచంద్రరెడ్డి (జయరాం)లు విభేదిస్తారు. చివరికి తండ్రినే చంపేసి.. సీఎం కావాలని అనుకుంటాడు మోపిదేవి. అదే సమయంలో సొంత ఊరు వైజాగ్‌కి కలెక్టర్‌గా అడుగుపెడతాడు రామ్ నందన్ (రామ్ చరణ్). వచ్చీ రావడంతోనే అవినీతి ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపి.. మోపిదేవి ఆట కట్టిస్తాడు. అనూహ్య పరిస్థితుల్లో సత్యమూర్తి.. రామ్ నందన్‌ని రాష్ట్ర సీఎంగా ప్రకటిస్తాడు. అసలు రామ్ నందన్ ఎవరు? అతని గతం ఏంటి? అభ్యుదయం పార్టీకి సత్యమూర్తికి ఉన్న సంబంధం ఏంటి? రామ్ నందన్‌ని ఎందుకు సీఎంగా ప్రకటించాడు? అప్పన్న (రామ్ చరణ్)కి రామ్ నందన్‌కి ఉన్న రిలేషన్ ఏంటి అనేదే ఈ సినిమా అసలు కథ. లంచగొండుల ఆట కట్టిస్తూ శంకర్ తీసిన జెంటిల్‌మెన్, ఒకేఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు చిత్రాల్లో కథానాయుడు అతి సామాన్యుడే. ఆ సామాన్యుడి తిరుగుబాటే శంకర్ చిత్రాలకు మూలం. కానీ ‘గేమ్ ఛేంజర్’ శంకర్ కథలకు భిన్నంగా సాగిన కథ. ‘గేమ్ ఛేంజర్’‌కి ఫ్లాష్ బ్యాక్ కథే కీలకం. అప్పన్నగా రామ్ చరణ్ పంచెకట్టు క్యారెక్టర్ ‘గేమ్ ఛేంజర్‌కి సోల్ ఆఫ్ ది మూవీ. ఓ గొప్ప సందేశాన్ని ఇస్తూ.. అంతకంటే గొప్పగా ఎమోషనల్ కనెక్టివిటీతో అద్భుతంగా సినిమా తీయడంలో శంకర్ నేర్పరి. గత కొన్నాళ్లుగా ఆ మార్క్‌ని మిస్ అవుతున్నారు శంకర్.

ఏపీ రాజకీయాలను చూపించారు
ఈ సినిమా టైటిల్ కార్డ్స్ పడే ముందే ‘ఈ సినిమాలోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఈ పాత్రలు బతికున్నా లేదా చనిపోయిన వారిని ఎవరినైనా ప్రభావితం చేసేవిగా ఉంటే అది యాదృచ్ఛికం మాత్రమే’ అని ప్రకటించినా.. సినిమాలోని చాలా సీన్లు ఏపీలోని గత ప్రభుత్వానికి రిలేటెడ్‌గా ఉన్నాయి. అలాగే ఏపీలోని జనసేన పార్టీ సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించారు. అంటే.. బాబాయ్‌ను చాలా గొప్పగా చూపించాడు దర్శకుడు. తెలుగు దేశం పార్టీ గుర్తును కూడా ఇందులో బాగా హైలెట్ చేశారు. ఒక ఐఏఎస్ అధికారికి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌గా ఈ సినిమా అనిపించినా.. మధ్యలో ఎన్నో విషయాలను ఈ సినిమా ద్వారా చెప్పి శంకర్ తన మార్క్ ప్రదర్శించాడు. మధ్యలో ఇసుక మాఫియా విషయంలో రామ్ నందన్, బొబ్బిలి మోపిదేవి మధ్య జరిగిన గొడవ – తదనంతర పరిణామాల వల్ల ఎన్నికల వరకు వెళ్లాల్సి వస్తుంది. ఇది ఇటీవల ఏపీలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాన్ని ఇట్టే చూపిస్తున్నది. ‘గేమ్ చేంజర్’ను మెగా అభిమానిగా చూస్తే… మరీ ముఖ్యంగా జనసేన శ్రేణులకు నచ్చే అంశాలు ఉన్నాయి. బొబ్బిలి మోపిదేవి (సూర్య) క్యారెక్టర్ మీద వేసిన కొన్ని పంచ్ డైలాగ్స్ ప్రతిపక్ష పార్టీ శ్రేణులు నొచ్చుకునేలా పేలాయి. ‘డబ్బు లేని రాజకీయాలు చేయాలి’ అని అప్పన్న పాత్ర చెప్పే, ఆ సిద్ధాంతాలు జనసేన కళ్యాణ్‌ను గుర్తు చేయడం మాత్రమే కాదు, జనసేనకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి.

రోటీన్‌ కొనసాగింది
యువ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథలో కమర్షియల్ సినిమాకు అవసరమైన హంగులు ఉన్నప్పటికీ.. దర్శకుడు చాలా మార్పులు చేసినట్లు సినిమా చూస్తుంటేనే అర్థమవుతుంది. స్టోరీలో కొత్తదనం లేదు. పొలిటికల్ డ్రామాలు, ఇంతకు ముందు శంకర్ తీసిన సినిమాలు చూసిన ప్రేక్షకులకు కథ కొత్తగా ఏమీ ఉండదు. రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రేమలో పడే సన్నివేశాలను కొత్తగా రాసి, తీసి ఉంటే బావుండేది. రొటీన్ అనిపించాయి. క్లైమాక్స్ కూడా సినిమాకు కావాల్సిన హై ఇవ్వలేదు. క్లైమాక్స్‌, కథనం క్షుణంగా పరిశీలిస్తే.. గతంలోని వినయ విధేయ రామ, రంగస్థలం వంటి కొన్ని సినిమాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. అయితే, ‘గేమ్ చేంజర్’… పక్కా కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫిల్మ్. స్టార్ హీరో నుంచి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఆశించే అంశాలు అన్నీ ఉన్నాయని అనిపించినా.. కథనం మాత్రం రోటీన్‌గా సాగింది. కమర్షియల్ ఫార్మటులో తీసినప్పటికీ… శంకర్ మార్క్ సీన్స్, రామ్ చరణ్ నటన, తమన్ సంగీతం ఫర్వాలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఏపీ రాజకీయాలపై జనాల్లో అవగాహన ఉంటే సినిమాను ఎక్కువ రిలేట్ చేసుకుంటారు.

అయితే ఏదో అద్భుతాన్ని ఆశించి.. గేమ్ ఛేంజర్‌కి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. కథ కూడా రొటీన్ ఫార్మేట్‌లోనే ఉంటుంది. ఆ రొటీన్‌కి తగ్గట్టుగా.. లాజిక్‌లు లేని చిత్ర విచిత్రాలు గేమ్ ఛేంజర్‌లో చాలానే ఉంటాయి. ముగింపు కూడా పరమరొటీన్ మాత్రమే కాకుండా వాస్తవ దూరంగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో మైనింగ్‌పై అప్పన్న పోరాటం.. పొలిటికల్ ఎంట్రీ.. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాన్సెప్ట్‌తో ఎదురైన సవాళ్లు ప్రతి సవాళ్లు డ్రామా తెరపై పండింది. ఎప్పుడైతే అప్పన్న ఎపిసోడ్ ముగిసిందో అప్పటి నుంచి కథనం గాడి తప్పింది. శానన సభ వ్యవస్థ, ముఖ్యమంత్రుల ఎంపిక నాటకీయంగా అనిపిస్తుంది. ప్రతిపక్ష నాయకుడు వెళ్లి.. ఈవీఎంలను పగలకొట్టేస్తుంటే.. చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్‌ డిష్యూం.. డిష్యూం అని ఫైట్లు చేయడం.. ఆ ప్రతిపక్ష నాయకుడ్ని అడ్డుకోవడం లాంటివి వాస్తవ దూరంగా అనిపిస్తాయి. శంకర్ లాజిక్‌లతో సంబంధం లేకుండా మాస్ ఎలిమిమెంట్స్ కూడా నేలవిడిచి సాము చేసినట్టుగానే అనిపిస్తాయి కొన్ని సీన్లు. హెలికాప్టర్‌పై వచ్చి.. రైల్వే ట్రాక్‌పై కట్టిపడేసిన వాళ్ల కట్లు కత్తితో తెంచే సీన్ అయితే బోయపాటిని గుర్తు చేశారు శంకర్. పాటల్లో కనిపించినంత దర్శకత్వ ప్రతిభ.. కథ, కథనాల్లో లోపించింది.
రాష్ట్ర సీఎంగా శ్రీకాంత్‌కి ఈ సినిమాలో కీ రోల్ పడింది. ప్రతినాయకుడిగా ఎస్‌జే సూర్య.. విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. ఎస్ జే సూర్య మేనరిజం కొత్తగా ఉంటుంది. ఒక్క పాత్రేకానీ చాలా వేరియేషన్ చూపించారు. గుండు లుక్‌లో విలనిజం పండించారు. సైడ్ సత్యంగా సునీల్ నవ్వించే ప్రయత్నం చేశారు కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. జయరాం, సముద్రఖనిలకు ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించారు. వెన్నెల కిషోర్, పృథ్వీ, నరేష్, బ్రహ్మానందం, రఘుబాబు, శుభలేఖ సుధాకర్ ఇలా చాలామంది ఉన్నారు కానీ.. వాళ్లంతా ప్యాండింగ్ ఆర్టిస్ట్‌లుగా మాత్రమే కనిపించారు. పెద్దగా ప్రాధాన్యత లేదు.

ఓవరాల్‌గా గేమ్ ఛేంజర్‌.. ‘రికార్డ్స్ ఛేంజర్’ అని అనలేం. అలాగని ‘గేమ్ ఓవర్’ అని కూడా తీసిపారేయలేం. నటుడిగా రామ్ చరణ్‌కి నూటికి నూరు మార్కులు పడతాయి. శంకర్‌కి మాత్రం జస్ట్ పాస్ మార్కులు మాత్రమే. అప్పన్న (రామ్ చరణ్) అన్ ప్రిడక్టబుల్.. శంకర్ ప్రిడక్టబుల్. పండక్కి పడింది కాబట్టి నిర్మాత దిల్ రాజుకి కాసులకు లోటు ఉండకపోవచ్చు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com