నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీ దేవి మూవీస్ సంస్థ నిర్మించిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ నేటి సాంకేతికతలకి అనుగుణంగా డిజిటలైజ్ చేయబడి ఈ సమ్మర్ లో గ్రాండ్ రీ-రిలీజ్ కి సిద్దం అవుతోoది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమాగా పేరొందిన ఈ చిత్రం శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందింది. శ్రీ కృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన, సింగీతం దర్శక నైపుణ్యం, ఎస్. పి బాల సుబ్రహ్మణ్యం గాత్రం-సమర్పణ, జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా అద్భుత సంగీతం, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ విలువలు, ఇతర నటీనటుల ప్రతిభ, అబ్బుర పరిచే సెట్స్, ఫైట్స్, దుస్తులు, నృత్యం ఇలా ప్రతీ ఒక్కరు చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్రలు పోషించారు. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఉన్నా , కొన్ని ప్రజల హృదయాల్లో, కళాభిమానుల లైబ్రరీలలో ఉండిపోయేవి, వాళ్లు ఎప్పుడూ మాట్లాడుకునేవి ఉంటాయి… ఆ కోవకు చెందిన చిత్రమే ‘ఆదిత్య 369’.