మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు శ్రీ కీరవాణి. ‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ విన్పించబోతున్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. ‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే… అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియచేస్తోంది.
ఆస్కార్ గ్రహీత కీరవాణిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన శ్రీ వేటూరి సుందర రామమూర్తి, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు. కీరవాణి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు – నేను వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకొని వదిలేయడం గుర్తు చేసుకున్నాను. చిదంబరనాథన్ ఇచ్చిన వయొలిన్ ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి.