ఈనెల 07వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శుభముహూర్తాలు
మూడున్నర నెలల విరామం తర్వాత శుభముహూర్తాలకు శుభఘడియలు వచ్చేశాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వివాహాది శుభకార్యాలకు ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆషాఢమాసం అయిపోవడం సోమవారం నుంచి శ్రావణమాసం మొదలు కావడంతో శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకోవడానికి ప్రజలు వేదపండితుల వద్దకు క్యూ కడుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచి శుక్ర మూఢమి, దానికి తోడు గురు మూఢమి రావడంతో శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. అయితే శ్రావణం రాకతో శుభ ముహూర్తాలకు వేళయింది. ఈ మాసంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సోమవారంతో మొదలైన శ్రావణమాసం సెప్టెంబర్ 3వ తేదీతో ముగియనుంది.ఈ నెల 31వ తేదీ లోపే శుభకార్యాలను ముగించుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు.
ఈ మాసంలో మంచి ముహూర్తాలు
ఈ నెల 7వ తేదీ, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24వ తేదీ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ నెలలో 28వ తేదీ పెళ్లిళ్లకు చివరి ముహూర్తమని, 17, 18 తేదీలు వివాహాలకు అత్యంత శుభ ముహూర్తాలని వేదపండితులు పేర్కొంటున్నారు. ఈ శుభ ముహూర్తాల్లో వారికి అనుకూల తేదీలను నిర్ణయించుకొని పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే సన్నద్ధమయ్యారు.
శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి పురోహితులు, బ్యాండుమేళం, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ల నిర్వాహకులు, ప్రింటింగ్ ప్రెస్, బట్టలు, కిరాణం, పండ్లు, పూలు, క్యాటరింగ్‌తో పాటు నగల వ్యాపారులకు ఇప్పుడు చేతినిండా పని దొరక నుంది. దీంతోపాటు ఈ నెల 9వ తేదీ నుంచి పండుగలు సైతం ప్రారంభం కానున్నాయి. 9వ తేదీన నాగుల పంచమి, 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం, 19వ తేదీన రాఖీ పౌర్ణమి, 27వ తేదీన కృష్ణాష్టమి పండగలు ఉన్నాయి.