Monday, April 7, 2025

స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ గురించి ప్రధానికి వివరించా: చంద్రబాబు

అమరావతి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటనకు నిన్న వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదని ప్రధానికి వివరించానన్నారు. ‘‘ స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ గురించి ప్రధానికి వివరించా. పోలవరం డయాఫ్రం వాల్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని కోరాం’’ అని చంద్రబాబు తెలిపారు.

విశాఖ రైల్వే జోన్‌ పనులకు త్వరలోనే శంకుస్థాపన
‘‘రాష్ట్రంలోని జాతీయ రహదారుల పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని ప్రధానిని కోరాను. కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్‌ రాయితీ గురించి వివరించాను. డిసెంబరు నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభమవుతాయి. విశాఖ రైల్వే జోన్‌ గురించి మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడాను. విశాఖ రైల్వే జోన్‌కు భూమి ఇవ్వలేక ఐదేళ్లు కాలయాపన చేశారు. మేం వచ్చాక విశాఖ రైల్వే జోన్‌కు భూమి కేటాయించాం. విశాఖ రైల్వే జోన్‌ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఫోర్‌ లైన్లు వేయాలని రైల్వే మంత్రిని కోరాను. అమరావతి నుంచి విజయవాడ రైల్వే లైను కోరాం. మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైల్వే లైన్‌ కనెక్ట్‌ చేయాలని కోరాం. నరసాపురం- మచిలీపట్నం, రేపల్లె-బాపట్ల లైన్లు ఇవ్వాలని కోరాం.

2027లోగా బుల్లెట్‌ రైలు పనులు ప్రారంభం కావొచ్చు!
సౌత్‌ఇండియాలో నాలుగు ముఖ్యమైన నగరాలను (హైదరాబాద్‌, అమరావతి, చెన్నై, బెంగళూరు) అనుసంధానం చేసేలా బుల్లెట్‌ రైలు నడపేలా చర్యలు తీసుకోవాలని కోరాం. ఈ నాలుగు ఎకానమిక్‌ హబ్‌లను కవర్‌ చేస్తూ బుల్లెట్‌ రైలు పెడితే ఆర్థికపరమైన కార్యలాపాలు మరింతగా పెరుగుతాయని చెప్పాం. ఆలోచిస్తామని చెప్పారు. 2027 నాటికి పనులు ప్రారంభం కావొచ్చు. నడికుడి- శ్రీకాళహస్తి, కోటిపల్లి-నరసాపురం మధ్య రైల్వే లైన్లు ఇవ్వాలని కోరాం. కొన్ని రైల్వే లైన్లకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలని కోరారు.. దానిపై చర్చిస్తాం. రాష్ట్రంలో రూ.75 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి. ఐటీ లిటరసీ, డిజిటల్‌ హబ్‌ పెట్టాలని కేంద్రాన్ని కోరాం. డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరాం. వచ్చే అవకాశం ఉంది. ఏఐ సాయంతో వచ్చే స్టార్టప్‌లను మరింత ప్రోత్సహిస్తాం. క్లౌడ్‌లో ఉన్న నాలెడ్జ్‌ను పూర్తిగా వినియోగించుకుంటాం.

హైదరాబాద్‌-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు కోసం ప్రతిపాదన

భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే బీచ్‌ రోడ్డును విస్తరిస్తాం. విమానాశ్రయానికి హైవే, బీచ్‌రోడ్డు, మెట్రో ద్వారా రాకపోకలు సాగించే విధంగా అభివృద్ధి చేస్తాం. సివిల్‌ ఏవియేషన్‌ వర్సిటీ ఏర్పాటు చేసే యోచన ఉంది. హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నంకు ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు ప్రతిపాదించాం. కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారు’’ అని చంద్రబాబు వివరించారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పైనా చర్చించాం
గిరిజన వర్సిటీని సాలూరులోనే కొనసాగిస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. దానిని మార్చే ఉద్దేశం లేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గురించి కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడానని, ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని కోరానని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌.. ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమన్న సంగతిని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com