Tuesday, February 11, 2025

మంద కృష్ణ.. మారిపోయారు నిన్నటిదాకా నిప్పులు.. ఇప్పుడు ప్రశంసలు

రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. నిన్నటిదాకా సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగిన ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ.. మంగళవారం నాటికి మారిపోయారు. సీఎంకు ఓ సోదరుడిలా అండగా ఉంటానని ప్రకటించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై సీఎం కమిట్ మెంట్ ను అభినందించారు. ఒక కమిట్ మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, సీఎంకు ఒక సోదరుడిగా అండగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మందకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
కాగా, రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి.. మందకృష్ణకు తెలిపారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని, వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.
ఇక, సీఎం సూచన మేరకు మంద కృష్ణ మాదిగ… ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణలో ఉపకులాల వారీగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత దేసంలోనే మొట్టమొదటి సారిగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ చేస్తానని ప్రకటించారు. అయితే ఈ వర్గీకరణ కోసం జీవితాంతం పోరాడిన మంద కృష్ణ రేవంత్ రెడ్డి ప్రకటనను హర్షించలేదు. తమకు నమ్మకం లేదన్నారు. ఈ మధ్య కాలంలో ఉద్యమం కూడా ప్రకటించారు. దాంతో ఇక నుచి వచ్చే ఉద్యోగ ప్రకటనలన్నీ వర్గీరణ తరవాతనే ఉంటాయన్నారు.
అ తర్వాత అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం ప్రవేశ పెట్టిన రోజు కూడా మందకృష్ణ మాదిగ చావు డప్పు కార్యక్రమాన్ని ప్రకటించారు. కానీ అనుమతి లభించకపోవడంతో వాయిదా వేశారు. ఈ లోపు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పాస్ కావడంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు నేరుగా వచ్చి రేవంత్ రెడ్డిని పొగడటంతో ఓ మిషన్ పూర్తయినట్లు అయింది. ఇంతకు ముందు మందకృష్ణ పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతుగా ఉండేవారు. ఆ పార్టీకే ఓటు వేయమని చెప్పేవారు. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ఓటు వేయమని చెప్పకపోయినా.. కాంగ్రెస్ పట్ల మాత్రం వ్యతిరేకత లేనట్లే అనుకోవచ్చు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com