మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇటీవల సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం గమనార్హం. “రాజ్యాంగ నిబంధనల ప్రకారం మణిపుర్‌లో రాష్ట్ర ప్రభుత్వం పాలనను కొనసాగించే పరిస్థితులు ప్రస్తుతం లేవు అనేది నా అభిప్రాయం. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం మణిపుర్‌లో రాష్ట్రపతి పాలనను విధిస్తున్నాను. ఇకపై మణిపుర్‌లోని అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, గవర్నర్ అధికారాలు నా పరిధిలోకే వస్తాయి” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అవిశ్వాస తీర్మానం పెట్టాలి
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రమోద్ తివారీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మణిపుర్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైన తరుణంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రమోద్ తివారీ ప్రశ్నించారు.