– భారతదేశ విశిష్ట నేతల్లో ఒకరంటూ మోదీ ట్వీట్
– తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
– తన గురువు ఇక లేరంటూ రాహుల్ గాంధీ ట్వీట్
– భరతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ ఒకరన్న ద్రౌపది ముర్ము
– ఆయన నాయకత్వం, వినయం దేశానికి సేవ చేయడంలో మాస్టర్‌క్లాస్ గౌతమ్ అదాని
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశిష్ట నేతల్లో ఒకరైన మన్మోహన్ కన్నుమూయడం పట్ల దేశం దుఃఖిస్తోంది అంటూ మోదీ ట్వీట్ చేశారు. నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారని మోదీ కొనియాడారు.
ఆర్థిక మంత్రి సహా, వివిధ హోదాల్లో పనిచేశారని, అనేక ఏళ్లుగా మన దేశ ఆర్థిక రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని కీర్తించారు. ఈ విషాద సమయలో ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు, అసంఖ్యాక అభిమానులకు సంతాపం తెలియజేసుకుంటున్నానని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. భారత మాజీ ప్రధాని, పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని చంద్రబాబు తెలిపారు. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతిరూపం అని అభివర్ణించారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నానని చంద్రబాబు వివరించారు.
కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల లోక్ సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మన్మోహన్ మృతితో తాను ఒక గురువును, మార్గదర్శిని కోల్పోయానంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో మన్మోహన్ సింగ్ అర్ధాంగికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నానని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సీనియర్ నేత మృతితో కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని అన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన మృతి రాజకీయాలకు అతీతంగా అందరినీ విషాదానికి గురి చేసింది. మన్మోహన్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
మన్మోహన్ మృతి నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని పునర్నిర్మించిన, ప్రపంచానికి తలుపులు తెరిచిన పరివర్తనాత్మక 1991 సంస్కరణల్లో ఆయన కీలక పాత్రను చరిత్ర ఎప్పటికీ గౌరవిస్తుందని అన్నారు. డాక్టర్ సింగ్ నాయకత్వం, వినయం అనేవి దేశానికి సేవ చేయడంలో మాస్టర్‌క్లాస్‌గా మిగిలిపోయిందన్నారు. ఇది రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని గౌతమీ అదానీ పేర్కొన్నారు.