కృష్ణానది వరద ముంపు తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్న అధికార గణానికి ప్రజలకి బుడమేరు పొంగిపొర్లి ఒక్కసారిగా మంతెన గ్రామాన్ని చుట్టుముట్టడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కంకిపాడు మండలం మంతెన గ్రామం వద్ద బుడగమేరు వాగు ఒక్కసారిగా పొంగిపొర్లి గ్రామాన్ని జలదిగ్బంధం చేసింది. వరద ప్రభావం తగ్గిందిలే అని ఊపిరి పీల్చుకుంటున్న అటు అధికారులు ఇటు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆగమేఘాల మీద సహాయక చర్యలు చేపట్టారు. మంతెన గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కృష్ణాజిల్లా సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మంతెన గ్రామాన్ని సందర్శించి ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం పునరావస కేంద్రంలో ఉంటున్న ప్రజలతో సంభాషించారు. వరద నీరు తగ్గుముఖం పట్టి ఎలాంటి ఇబ్బందులు లేవనే వరకు పునరావాసంలోనే ఉండాలని సబ్ కలెక్టర్ ప్రజలను కోరారు. గ్రామంలో అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఉయ్యూరు ఆర్డిఓ రాజుతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.
సబ్ కలెక్టర్ గీతా శర్మ మీడియాతో మాట్లాడుతూ కృష్ణానది వరద పోటు తగ్గిన బుడమేరు మాత్రం అదే స్థాయిలో ప్రవహిస్తుందని మంతెన ముంపు తమ ఊహించలేదని ముంపు బారిన పడిన వెంటనే అన్ని సహాయక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2000 కుటుంబాలు పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నాయని గీతాంజలి శర్మ మీడియాకు తెలిపారు.