బెయిలు వచ్చిన మరునాడే మంత్రి పదవా- సుప్రీం అసహనం
నగదు మోసం కేసులో బెయిలుపై విడుదలైన మరునాడే మంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని సుప్రీంకోర్టు నిలదీసింది. అసలు తమిళనాడులో ఏం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సెంథిల్ బాలాజీకి బెయిలు మంజూరు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మంగళవారం న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలో ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురి వద్ద నగదు వసూలుచేసి మోసానికి పాల్పడ్డారని అప్పటి రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై అవినీతి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల ఆధారంగా చట్టవిరుద్ధంగా నగదు బదిలీకి పాల్పడ్డారని సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు గత ఏడాది జూన్ 14న అరెస్ట్ చేశారు. ఈ కేసులో 471 రోజులు జైలుశిక్ష అనుభవించిన సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆయన బెయిలుపై విడుదలైన మరుసటిరోజు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.