Sunday, January 19, 2025

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ …

రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్​ హతం

మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది జనవరిలో రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన బడే చొక్కారావు అలియాస్​ దామోదర్​ .. ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్లో హతమయ్యారు. ఈ విషయాన్ని మావోయిస్ట్​ పార్టీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి మావోయిస్టు పార్టీ రెండున్నరేళ్ల తర్వాత నూతన కార్యదర్శిని గతేడాది నియమించింది. 2021 జూన్‌ 21న కరోనాతో అప్పటి కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ మృతి చెందారు. అప్పటి నుంచి ఈ పదవిలో ఎవరూ లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్న మావోయిస్టు పార్టీ ఎట్టకేలకు బడే చొక్కారావు అలి యాస్‌ దామోదర్‌ను నూతన కార్యదర్శిగా నియమించింది. అప్పటికే రాష్ట్ర యాక్షన్‌ టీం కమాండర్‌గా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న దామోదర్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించటంతో తెలంగాణలో మళ్లీ మావోయిస్టులు ఉద్యమాన్ని బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నట్టు భావించారు. కానీ, ఆయన ఎన్​కౌంటర్లో హతమవడం పార్టీని ఆందోళనలో పడేసింది.

రెండున్నరేళ్లుగా కార్యదర్శి కోసం…
యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ మృతి తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలు చేపట్టే నేత కోసం అగ్రనేతలు పలువురి పేర్లను పరిశీలిస్తూ వచ్చారు. వీరిలో ప్రధానంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, యాక్షన్‌టీం రాష్ట్ర కార్యదర్శి, ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యుడు, గోవిందరావుపేట మండలం మొద్దలగూ డెం గ్రామానికి చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌, ఏవోబీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి అలియాస్‌ గణేష్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌ – మంచిర్యాల డివిజ న్‌ కమిటీ కార్యదర్శి మైలారపు అడేళ్ల అలియాస్‌ భాస్కర్‌, బండి ప్రకాశ్‌ అలియాస్‌ బండి దాదా, జేఎండబ్ల్యూసీ డివిజన్‌ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలి యాస్‌ వెంకటేశ్‌ పేర్లను కేంద్ర కమిటీ పరిశీలించింది. అయితే రెండునరేళ్లుగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టింది. దీంతో తెలంగాణలో ఉద్యమం విస్తరించటం లేదని భావించిన కేంద్ర నాయకత్వం కార్యదర్శి ఎంపికపై దృష్టి సారిం చి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు నేతృత్వంలో కేంద్ర కమిటీలోని కీలక నేతలు చర్చలు జరిపి మావోయిస్టు తెలంగాణ కార్యదర్శి నియామకం చేసింది.

అయితే, హరిభూషణ్‌ వారసత్వాన్ని కొనసాగించేందుకు, ఉద్యమానికి బలం ఉన్న ఉత్తర తెలంగాణలో గట్టి పట్టున్న తెలంగాణ యాక్షన్‌ టీం కమాండర్‌గా ఉన్న బడె చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ వైపు మావోయిస్టు కేంద్ర కమిటీ మొగ్గు చూపింది. 1993లో అప్పటి సీపీఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ గ్రూపులో దామోదర్‌ ఏటూరునాగారం దళ సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత ఏటూరునాగారం-మహదేవపూర్‌ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరగక ముందు కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌(కేకేడబ్ల్యూ) డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా దామోదర్‌ పని చేశారు.

అనంతరం 2016-17లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్‌ను ఏర్పాటు చేసి, దానికి కార్యదర్శిగా కూడా దామోదర్‌ పనిచేశారు. 2019లో జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కార్యదర్శి బాధ్యతల నుంచి పార్టీ తప్పించి రాష్ట్ర కమిటీలోకి తీసుకుంది. రాష్ట్ర యాక్షన్‌టీమ్‌ కమిటీ కమాం డ ర్‌గా పదోన్నతితో నియమించింది. ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో దామోదర్‌కు గట్టి పట్టుండటంతో పాటు పార్టీతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. దీంతో ఆయన వైపే పార్టీ కేంద్ర నాయకత్వం మొగ్గు చూపినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. దామోదర్‌పై సుమా రు 75కి పైగా కేసులు ఉన్నాయి. ప్రభుత్వం దామోదర్‌పై రూ.25 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

కాల్వపల్లి ఆదివాసీ బిడ్డ
బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ది ములుగు జిల్లా తాడ్వా యి మండలం కాల్వపల్లి. ఆయన సోదరుడు బడే నాగేశ్వర్‌రావు కూడా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. 2008లో బడే నాగేశ్వర్‌రావు దంపతులు తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సోదరుడు నాగేశ్వర్‌రావు అడు గు జాడల్లోనే విప్లవ బాటలో దామోదర్‌ నడిచారు. 1993లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన దామోదర్‌ ఏటూరునాగారం ఏరియా కమిటీలో చేశారు. ఏటూరునాగారం ఎస్టీ హాస్టల్‌లో పదో తరగతి వరకు చొక్కారావు చదువుకున్నారు. ఈ ప్రాంతంపై దామోదర్‌ గట్టి పట్టు సాధించారు. మూడుదశాబ్దాలుగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, యాక్షన్‌ టీం కమాండర్‌గా వ్యవహరించారు. రాష్ట్ర కార్యదర్శిగా దామోదర్‌కు మావోయిస్టు బాధ్యతలు అప్పగించిన సరిగ్గా ఏడాదికి ఆయన ఎన్​కౌంటర్​ లో హతమవడం పార్టీని కోలుకోలేని ఆయోమయంలో పడేసినట్లైంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com